త్వరలోనే బస్సు డిపో ప్రారంభిస్తాం | - | Sakshi
Sakshi News home page

త్వరలోనే బస్సు డిపో ప్రారంభిస్తాం

Jun 1 2026 7:17 AM | Updated on Jun 1 2026 7:17 AM

పెద్దపల్లి/పెద్దపల్లి రూరల్‌: జిల్లా కేంద్రంలో త్వరలోనే ఆర్టీసీ బస్సు డిపో ప్రారంభిస్తామని రోడ్డు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. పెద్దపల్లిలో ప్రతిపాదిత బస్సు డిపో స్థలాన్ని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్‌ విజయరమణారావుతో కలిసి ఆదివారం ఆ యన పరిశీలించి మాట్లాడారు. డిపో పనులు కొంత ఆలస్యమైనా.. వేగవంతం చేస్తామన్నారు. గ్రామాలకు బస్సు కనెక్టివిటీని మరింత మెరుగుపర్చుతున్నామనిమంత్రి చెప్పారు. ప్రజావసరాలకు అనుగుణంగా కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియ కూడా కొనసాగుతోందని అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి నాయకత్వంలో ఐదుగురు మంత్రులు, సీనియర్‌ అధికారులు, 40 మంది ఆర్టీసీ ప్ర తినిధులతో చర్చలు జరిపి కార్మికులకు 11 శాతం పీఆర్సీ మంజూరు చేసినట్లు వివరించారు. అనంతరం మంత్రులు పొన్నం ప్రభాకర్‌గౌడ్‌, దుద్దిళ్ల్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్‌ విజయరమణారావును మున్సిపల్‌ చైర్మన్‌ నూగిల్ల మల్లయ్య సన్మానించారు. అంతకుముందు సుల్తానాబాద్‌లో కాంగ్రెస్‌ నా యకులు, సర్పంచులు, కౌన్సిలర్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు స్వాగతం పలికి సన్మానించారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్టీసీ మేనేజర్‌ కేఆర్‌రెడ్డి, సుల్తానాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మినుపాల ప్రకాశ్‌రావు, మాజీ జెడ్పీటీసీ ఐల రమేశ్‌, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు అబ్బయ్య గౌడ్‌, మండల అధ్యక్షుడు చిలుక సతీశ్‌, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మహిళలకు 310 కోట్లకుపైగా జీరో టికెట్లు

మంథని: ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద ఇప్పటివరకు మహిళలకు 310కోట్ల జీరో టికెట్లు జారీచేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ తెలిపారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో రూ.93లక్షల వ్యయంతో చేపట్టనున్న అదనపు ప్లాట్‌ఫారాలు, ఇతర అభివృద్ధి పనులకు ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కలెక్టర్‌ కోయ శ్రీహర్షతో కలిసి శంకుస్థాపన చేశారు. మంత్రి శ్రీధర్‌బాబు సూచనల మేరకు మంథని, కాళేశ్వరం బస్టాండ్‌ల అభివృద్ధికి నిధులు మంజూ రు చేశామన్నారు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ప్రతీరోజు 65లక్షల మంది మహిళలు ఆర్టీసీ సేవలు పొందుతున్నారని, ప్రతీ గ్రామానికి మెరుగైన కనెక్టివిటీ కల్పించే దిశగా బస్సులు పెంచుతామని తెలిపారు. 2027 గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం క్యాబినెట్‌ సబ్‌ కమిటీని నియమించిందని, కుంభమేళాను తలపించే స్థాయిలో పుష్కరాలు నిర్వహించేందుకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని ఆయన చెప్పారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, మంథని బస్టాండ్‌ ఆధునికీకరణతోపాటు పెద్దపల్లి బస్‌డిపోను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. మున్సిపల్‌ చైర్మన్‌ వొడ్నాల శ్రీనివాస్‌, ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ రాజు, డెప్యూటీ ఆర్‌ఎం మల్లేశం, డిపో మేనేజర్‌ శ్రావణ్‌ కుమార్‌, ఆర్డీవో సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్‌

Advertisement
 
Advertisement
Advertisement