పెద్దపల్లి: జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. వడగాలులు జిల్లావాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్లకే పరిమితం కావాలని చెబుతున్నారు. దీంతో జిల్లాలో ఎక్కడ చూసినా జనసంచారం లేక రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇటీవల కురిసిన మోస్తరువాన అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. వర్షంతో ఉక్కపోత మరింత పెరిగింది. భూమినుంచి వేడి వస్తోందని ప్రజలు వాపోతున్నారు.
తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
అత్యవసరమైతే బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా తెల్లని రుమాలు, తలపాగా ధరించాలి. తరచూ ద్రవపదార్థాలు తీసుకోవాలి. ఓఆర్‌ఎస్ లాంటివి వెంట తీసుకెళ్లాలి. వడదెబ్బకు గురైతే వెంటనే సమీపంలోని ఆస్పత్రిని ఆశ్రయించాలి.
108ని సంప్రదించండి
అత్యవసర పరిస్థితుల్లో 108ని సంప్రదించాలి. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున ఇళ్లనుంచి బయటకు వెళ్లకపోవడమే మంచి ది. శారీరక శ్రమ ఉన్న పనులకు అస్సలు వెళ్లవద్దు. బయటకు వెళితే తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. దాహం వేయకుండా తరచూ మంచినీరు తాగాలి.
– ప్రమోద్ కుమార్, జిల్లా వైద్యాధికారి


