కాళేశ్వరంపై ప్రజా ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

కాళేశ్వరంపై ప్రజా ఉద్యమం

May 31 2026 1:18 AM | Updated on May 31 2026 1:18 AM

కాంగ్రెస్‌ తీరుతోనే నీటిమట్టం పడిపోయింది యుద్ధప్రాతిపదికన వినియోగంలోకి తీసుకురావాలి బీజేపీ నేత బండారు దత్తాత్రేయ

గోదావరిఖని: కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజా ఉద్యమానికి సిద్దమని మాజీ గవర్నర్‌, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. గోదావరిఖనిలోని బీజేపీ నాయకులు బల్మూరి అమరేందర్‌రావు నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేపట్టి వినియోగంలోకి తీసుకు రావాలని డిమాండ్‌ చేశారు. 19.83 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని తెలిపారు. అప్పట్లో బీఆర్‌ఎస్‌ ప్రభు త్వం రూ.లక్ష కోట్లతో నిర్మించినా.. మరమ్మతుల పేరిట కాంగ్రెస్‌ ప్రభుత్వం గాలికొదిలేసిందని వి మర్శించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఎలా మరమ్మతు చేయాలనే విషయంపై నిపుణులు నివేదికలు కూడా ఇచ్చారని గుర్తుచేశారు. కా ళేశ్వరం ప్రాజెక్టు బాధ్యులపై చర్యలు తీసుకోవాల ని, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఆలోచన సరికాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ భరోసా ఇస్తుందో లేదో స్పష్టం చేయాలన్నారు.

కొత్త గనుల కోసం సానుకూలంగా స్పందిస్తాం

సింగరేణిలో కొత్త గనుల ఏర్పాటు కోసం అన్వేషణ చేస్తే కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని దత్తాత్రేయ అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, అయినా.. 49 శాతం వాటా ఉన్న కేంద్రప్రభుత్వం కూడా కీలకంగా వ్యవహరిస్తుందన్నారు. గతంలో వేలంపాటపై అవినీతి దుమారం లేపడంతో ఒక పద్ధతి ప్రకారంగా బొగ్గు బ్లాకుల వేలం కొనసాగుతోందన్నారు. నాయకులు సంజీవరెడ్డి, బల్మూరి వనిత, బల్మూరి అమరేందర్‌రావు, కోమళ్ల మహేశ్‌, సురేశ్‌రెడ్డి, మేర్గు హన్మంతుగౌడ్‌, పిడుగు కృష్ణ, తోట మమత, సుల్వ లక్ష్మీనర్సయ్య పాల్గొన్నారు.

దత్తాత్రేయకు వీడ్కోలు

రామగుండం: బీజేపీ నాయకులు బల్మూరి వనతి నివాసానికి చేరుకున్న మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ హైదరాబాద్‌కు కాగజ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో పయనమయ్యారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, నాయకులు బల్మూరి అమరేందర్‌రావు, మీస అర్జున్‌రావు తదితరులు ఆయనకు రామగుండం రైల్వేస్టేషన్‌లో వీడ్కోలు పలికారు.

Advertisement
 
Advertisement
Advertisement