సర్కారు బడుల బలోపేతంపై దృష్టి | - | Sakshi
Sakshi News home page

సర్కారు బడుల బలోపేతంపై దృష్టి

May 29 2026 2:37 AM | Updated on May 29 2026 2:37 AM

మంథనిరూరల్‌: ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్‌లు పెంచి మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రొ.జయశంకర్‌ బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో బడిబాట చేపట్టడంతో పాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ పాఠశాలల బలోపేతంలో గ్రామస్తులను భాగస్వామ్యం చేసేలా అడుగులు వేస్తోంది.

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో..

జిల్లాలోని 14 మండలాల్లో 545 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో అనేక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువ శాతమే ఉంది. ఒకరిద్దరు విద్యార్థులతోనే పాఠశాలలను నడిపించే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈక్రమంలో ప్రతీ పాఠశాలలో అడ్మిషన్‌ల సంఖ్య పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలను బలో పేతం చేసేలా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టినా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఈసారి అడ్మిషన్‌లు పెంచేలా చర్యలు చేపట్టింది.

అవగాహన ర్యాలీలు.. ఇంటింటా ప్రచారాలు

ప్రొ.జయశంకర్‌ బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రతీ గ్రామంలో అవగాహన ర్యాలీలతో పాటు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు, సౌకర్యాలపై ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగి విద్యార్థుల విజయాలను వివరిస్తూ అడ్మిషన్‌ల సంఖ్య పెంపుపై దృష్టిసారించారు.

విద్యార్థులను గుర్తించి..

బడిబాట కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు విద్యార్ధులను గుర్తించి వారిని పాఠశాలల్లో చేర్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుతున్న చిన్నారులను ప్రాథమిక, ప్రాథమికలో చదివినవారిని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు చేపడతారు. అలాగే పని ప్రదేశాలు, నివాస ప్రాంతాల్లోని చిన్నారులను గుర్తించి వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందే వసతులు, సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం వంటి సదుపాయాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.

జనగణన.. విద్యావారోత్సవాల్లో టీచర్లు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనగణన, ప్రజాప్రాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యావారోత్సవాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు బాధ్యతలు అప్పగించారు. జిల్లాలోని సుమారు 90శాతం మంది ఉపాధ్యాయులు ఈ విధుల్లో బిజిబిజీగా ఉన్న క్రమంలోనే బడిబాట ప్రారంభించడం తమకు భారమవుతుందనే అభిప్రాయాలు ఉపాధ్యాయులు వ్యక్తం చేస్తున్నారు. వేసవికాలం ఎండ తీవ్రత నేపథ్యంలో ఏ విధులకు ఎలా హాజరు కావాలో అర్థం కావడం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అడ్మిషన్ల పెంపే లక్ష్యంగా..

పల్లెల్లో ప్రారంభమైన బడిబాట

అవగాహన ర్యాలీలు.. ఇంటింటా ప్రచారాలు

జనగణన.. విద్యావారోత్సవాల్లో ప్రభుత్వ టీచర్లు

అడ్మిషన్‌లు పెంచేలా కృషి

ప్రభుత్వ పాఠశాలల్లో అడిష్మన్‌లు పెంచేలా కృషి చేస్తున్నం. ఇప్పటికే విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రతీ పాఠశాల పరిధిలో బడిబాట కార్యక్రమాలను ప్రారంభించాం. షెడ్యూల్‌ ప్రకారం అన్ని కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకునేలా ప్రయత్నం చేస్తున్నం. బడిబాటలో గ్రామస్తులను భాగస్వామ్యం చేసేలా చర్యలు చేపట్టాం.

– దాసరి లక్ష్మి, మండల విద్యాధికారి, మంథని

Advertisement
 
Advertisement
Advertisement