గోదారిఖని(రామగుండం): బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతతో పాటు నాణ్యతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని సింగరేణి సీఎండీ బుద్ధప్రకాశ్‌జ్యోతి సూచించారు. గురువారం రామగుండం రీజియన్‌లో పర్యటించారు. పారిశ్రామిక ప్రాంతానికి చేరుకున్న సీఎండీకి డైరెక్టర్లు, జీఎంలు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. రెండురోజుల పర్యటనలో భాగంగా గురువారం ఆర్జీ–1, 2 ఏరియాల్లో పర్యటించారు. ఆర్జీ–2 ఏరియాలోని సీహెచ్‌పీని సందర్శించి బొగ్గు రవాణా, నాణ్యత ప్రమాణాల నిర్వహణపై అధికారులు, ఉద్యోగులతో సమీక్ష నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న కొత్త సీహెచ్‌పీ బంకర్ పనులను పరిశీలించి, బంకర్ సామర్థ్యం, బొగ్గు రవాణా విధానం గురించి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఓసీపీ–3 ప్రాజెక్టును వ్యూపాయింట్ ద్వారా సందర్శించారు. గని జీవితకాలం, ఉత్పత్తి ప్రక్రియ, నాణ్యత ప్రమాణాలు తదితర అంశాలపై డైరెక్టర్లు, ఏరియా జీఎం, ఇతర అధికారులతో చర్చించారు. బొగ్గు ఉత్పత్తితో పాటు ఓవర్‌బర్డెన్ తొలగింపులో కూడా నిర్దేశిత లక్ష్యాలను అధిగమించాలని సూచించారు.
రెస్క్యూ సిబ్బందికి అభినందన
మైన్స్ రెస్క్యూ స్టేషన్‌ను సందర్శించిన సీఎండీ, ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో బహుమతులు సాధించిన రెస్క్యూ జట్టు సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. జీడీకే–5 ఓపెన్‌కాస్ట్ గనిని సందర్శించి ఉత్పత్తి తీరును వ్యూపాయింట్ ద్వారా పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. సీఎండీ వెంట డైరెక్టర్లు ఎల్‌వీ సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, ఎం.తిరుమలరావు, ఈడీ (కోల్ మూవ్‌మెంట్) బి.వెంకన్న, జీఎం (కోఆర్డినేషన్– మార్కెటింగ్) టి. శ్రీనివాస్, ఆర్జీ1,2,3, అడ్రియాల ప్రాజెక్టు జీఎంలు లలిత్‌కుమార్, బండి వెంకటయ్య, మధుసూదన్, కొలిపాక నాగేశ్వరరావు, జీఎం(రెస్క్యూ) శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి సీఎండీ బుద్ధప్రకాశ్ జ్యోతి
రామగుండం రీజియన్‌లో పర్యటన
రెస్క్యూ జట్టుకు అభినందన


