సాక్షి,పెద్దపల్లి: భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్)లో సంస్థాగత సందడి మొదలైంది. నాలుగేళ్లుగా సంస్థాగత ఎన్నికలు లేక స్తబ్థతగా ఉన్న గులాబీ పార్టీ ఇటీవల జిల్లా, మండల కమిటీలు, అనుబంధ సంఘాల కార్యవర్గాలను రద్దు చేసింది. దీంతో పాటు కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు ప్రక్రియకు చకచక అడుగులు పడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఎమ్మెల్సీ వెంకట్‌రెడ్డి, రామగుండం ఇన్‌చార్జిగా ఎనుగు రవీందర్‌రెడ్డి, మంథనికి వీర్ల వెంకటేశ్వర్‌రావు, థర్మపురికి మూల విజయారెడ్డిలను నియమించారు. వీరి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదుకు బూత్‌స్థాయి ఇన్‌చార్జీల నియామక ప్రక్రియ వేగంగా సాగుతోంది. జిల్లాలో మొత్తం 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఉన్న వేలాది పోలింగ్ బూత్‌లకు ఇద్దరేసి చురుకై న కార్యకర్తలను ఇందుకోసం నియమిస్తున్నారు. బూత్ స్థాయి తర్వాత మండల స్థాయిలో సభ్యత్వ నమోదు ప్రక్రియ వేగంగా జరిగేందుకు ఐదుగురు ముఖ్య నాయకులతోనే కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను సీరియస్‌గా తీసుకుని ముందుకు సాగుతోంది. గతం మాదిరిగానే పెద్ద ఎత్తున సభ్యత్వాల నమోదుకు దూసుకు పోయేలా కసరత్తు చేస్తోంది.
డిజిటల్ రూపంలో సభ్యత్వాలు
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన ఎస్‌ఐఆర్ ప్రక్రియతో పాటు ఓటర్ లిస్ట్ సవరణ, తదితర కార్యాచరణ మొత్తం డిజిటల్ ప్రక్రియలో జరుగుతున్న నేపథ్యంలో పార్టీ సభ్యత్వం కూడా డిజిటలైజేషన్ పద్ధతిలో జరపాలని నిర్ణయించింది. గతంలో నియోజకవర్గాల ఇన్‌చార్జీలకు బుక్కులు పంపించి వాటిలో సభ్యత్వం తీసుకునే కార్యకర్త పేరు, వివరాలు నమోదు చేసేవారు. ఇలా సేకరించిన సమాచారాన్ని కంప్యూటర్‌లో నిక్షిప్తం చేసి కేంద్ర కార్యాలయానికి పంపించేది. కాని ఇప్పుడు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని కొత్త సదుపాయాన్ని తీసుకువచ్చారు. డిజిటల్ రూపంలో సభ్యత్వాల నమోదుకు బీఆర్‌ఎస్ నిర్ణయించింది. కార్యకర్త పేరు, చిరునామా వివరాలు నేరుగా ఆన్‌లైన్‌లో నమోదు చేసి వారికి రిజిస్ట్రేషన్ నంబర్‌ను కేటాయిస్తారు. ఈ విధానంలో సభ్యత్వాల నమోదు సులువుగా మారడంతో పాటు త్వరగా పూర్తి చేయడానికి అవకాశం ఏర్పడుతుందని బీఆర్‌ఎస్ పార్టీ భావిస్తోంది. గతంలో చేపట్టిన సభ్యత్వాల నమోదు రికార్డు స్థాయిలో జరిగింది. నియోజకవర్గానికి 50వేలు సభ్యత్వాలు తగ్గకుండా చేపట్టారు. ఇప్పుడు అదే స్థాయిలో సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుడుతున్నారు.
అసంతృప్తవాదులే లక్ష్యం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ అసంతృప్తితో ఉన్న నాయకులు, కార్యకర్తలందరినీ లక్ష్యంగా చేసుకొని ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టబోతున్నారు. దీనికి గ్రామస్థాయి నుంచి అసంతృప్తితో ఉన్న నాయకులు, కార్యకర్తల జాబితాను సిద్ధం చేస్తున్నారు. సభ్యత్వ నమోదు ప్రారంభం కాగానే ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జిలతో అసంతృప్తవాదులందరికీ సభ్యత్వం కట్టబెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. గణనీయంగా సభ్యత్వాన్ని నమోదు చేసి బీజేపీ, కాంగ్రెస్‌లకు గట్టి షాక్‌నివ్వాలని బీఆర్‌ఎస్ నేతలు యోచిస్తున్నారు.
జిల్లాలో పట్టు నిలుపుకునే ప్రయత్నం
డిజిటల్ రూపంలో జరుగనున్న సభ్యత్వాలు
తదనంతరం పార్టీ కార్యవర్గాల నియామకం
ప్రతీ సెగ్మెంట్‌కు 50వేల సభ్యత్వం టార్గెట్
టార్గెట్ బీజేపీ, కాంగ్రెస్
కొద్దిరోజుల నుంచి బీజేపీ, కాంగ్రెస్‌లు తమ రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని ఎదురుదాడి కొనసాగిస్తున్న క్రమంలో ఆ రెండు పార్టీలకు దీటైన సమాధానం చెప్పేందుకు వ్యూహాత్మకంగా బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చింది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 50 వేల నుంచి లక్ష వరకు పార్టీ సభ్యత్వాన్ని చేపట్టాలని నిర్ణయించారు. దీని కోసం జిల్లాలపై పార్టీ పరంగానే కాకుండా, కేడర్ నాయకులతో సన్నిహిత సంబంధాలు, చనువు ఉన్న నాయకులను సభ్యత్వ ఇన్‌చార్జీలుగా అధి ష్టానం నియమించింది. ఈ ఇన్‌చార్జీల దిశానిర్దేశంతోనే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామస్థాయి నుంచి చేపట్టబోతున్నారు.


