● 31లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి
● ‘సాక్షి ఫోన్ ఇన్’లో
సివిల్ సప్లయి డీఎం శ్రీకాంత్‌రెడ్డి
పెద్దపల్లి: జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా జరుగుతున్నాయని సివిల్ సప్లయి డీఎం శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లలో సమస్యలపై నిర్వహించిన ‘ఫోన్ ఇన్’ కార్యక్రమంలో పలువురు రైతులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. జిల్లాలో 4లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటివరకు 3లక్షల 23వేల 597 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. రైతుల ఖాతాల్లో రూ.604 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. 128 రైస్‌మిల్లులకు ధాన్యాన్ని సరఫరా చేస్తున్నారన్నారు. జిల్లావ్యాప్తంగా 334 కేంద్రాలను ప్రారంభించగా 30 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి చేసి మూసివేసినట్లు తెలిపారు. ఈనెల 31లోగా కొనుగోళ్లు పూర్తి కానున్నట్లు వివరించారు.


