పెద్దపల్లి: జిల్లాలో పీఎం సేతు పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. పథకం అమలుపై ఐడీవోసీ కార్యాలయంలో బుధవారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ పథకం కింద 50శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం, 33శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం, 17 శాతం నిధులు పరిశ్రమలు భరించి ఐటీఐ క్లస్టర్లను ఆధునీకరించడం జరుగుతుందన్నారు. వచ్చే ఐదేళ్లలో పెద్దపల్లి క్లస్టర్ పరిధిలో ఐటీఐల అభివృద్ధికి కేంద్రం రూ.120 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.80 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. పారిశ్రామిక భాగస్వాములు సుమారు రూ.40 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో ఈ పథకాన్ని అమలు చేసేందుకు సింగరేణి, ఎన్టీపీసీ సంస్థలతో భాగస్వామ్యం కోసం చర్చలు జరుపుతున్నామన్నారు.
ధాన్యం అన్‌లోడింగ్ పూర్తి చేయాలి
జిల్లాలో ధాన్యం కొనుగోలు, దిగుమతి ప్రక్రియలో జాప్యం ఉండొద్దని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. సుల్తానాబాద్‌లోని పూసాల, సుగ్లాంపల్లి ప్రాంతాల్లోని పలు రైస్ మిల్లులను సందర్శించారు. ధాన్యం దిగుమతి, అన్‌లోడింగ్ ప్రక్రియను తనిఖీ చేశారు. కొనుగోళ్లలో ఎలాంటి కటింగ్‌లు, కోతలు అనుమతించబోమని స్పష్టం చేశారు. లారీ రైస్‌మిల్లుకు చేరిన 24గంటల్లోపు అన్‌లోడింగ్ పూర్తి చేయాలన్నారు.
చేపల పెంపకం ద్వారా యువతకు ఉపాధి
సింగరేణికాలనీలో చేపల పెంపకం ద్వారా యువతకు ఉపాధి కల్పించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఐడీవోసీలో మత్స్యశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ సింగరేణికాలనీలో బొగ్గు తవ్వకాలు పూర్తైన తర్వాత అక్కడ మిగిలిన చెరువును చేపల పెంపకానికి వినియోగించే అవకాశాలు ఉన్నాయన్నారు. చేపల పెంపకం ద్వారా కనీసం 50మందికి జీవనోపాధి కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. వచ్చే 20 రోజుల్లో ప్రాజెక్టును గ్రౌండింగ్ చేయాలన్నారు.
నాణ్యమైన విద్యాఫలాలు చేరాలి
ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య 100శాతం ప్రజలకు చేరేలా కృషి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక, విద్యా వారోత్సవాల్లో భాగంగా సర్పంచులు, కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లతో కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని, పాఠశాలల అభివృద్ధి పనులను స్థానిక ప్రజాప్రతినిధులు పర్యవేక్షించాలని సూచించారు. తల్లిదండ్రులు– ఉపాధ్యాయుల సమావేశాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని, డ్రాప్ అవుట్ అవుతున్న విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు.
మెరుగైన వైద్యం అందించాలి
జిల్లా ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. ఐడీవోసీ కార్యాలయంలో వైద్యారోగ్యశాఖ అధికారులతో మాట్లాడారు. ఆసుపత్రిలో డెంటల్, ఓపీ సేవలను మెరుగు పరచాలని ఆదేశించారు. ఫిజియోథెరఫీ సేవల్లో నాణ్యత తగ్గకుండా చూడాలన్నారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష


