కోల్‌సిటీ(రామగుండం): వ్యాధి నిర్ధారణ, చికిత్సలో పేషెంట్లకు వినియోగించిన బయో మెడికల్ వ్యర్థా లు ఎక్కడపడితే అక్కడ పడవేయడంతో రామగుండం నగర ప్రజలకు పెనుముప్పుగా పరిణమిస్తున్నాయి. ప్రధానంగా ప్రైవేట్ ఆస్పత్రులు, డయోగ్నస్టిక్ ల్యాబ్‌ల నుంచి వెలువడే జీవవైద్య వ్యర్థాల ని ర్వహణ గాడితప్పడంలో రోడ్లపై, చెత్తకుప్పల్లోకి చే రుతున్నాయి. వీటిద్వారా అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రజారోగ్యంతో చెలగాటం
మనుషులు, జంతువుల వ్యాధి నిర్థారణ కోసం వినియోగించిన వేస్టేజీని రోజూ సేకరించడానికి కరీంనగర్‌లోని వెంకటరమణ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కు బాధ్యతలు అప్పగించారు. ఆ వాహన సిబ్బందికే ఆస్పత్రుల నిర్వాహకులు జీవవైద్య వ్యర్థాలు అందజేయాల్సి ఉంది. కానీ నగరంలోని చాలా ఆస్పత్రులు, ల్యాబ్‌లు నిబంధలను ఉల్లంఘిస్తూ, చెత్త చెత్తకుప్పల్లో వేస్తున్నారు.
చాపు ముప్పు
హెచ్‌ఐవీ, టీబీ, హైపటైటీస్ తదితర బాధితులకు వాడిన సూదులు, బ్లేడులు ఇతర వైద్యవ్యర్థాలను బహిరంగంగా రోడ్లపై పడవేస్తున్నారు. ఇవి ఇతరులకు గుచ్చుకుంటే ప్రాణాంతక వ్యాధులు సోకే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆస్పత్రి వ్యర్థాల్లోని బ్యాక్టీరియా, వైరస్ త్వరగా వ్యాపించి జీర్ణకోశ, శ్వాసకోశ, చర్మ సంబంధిత వ్యాధులు ప్రబలుతాయని వారు అంటున్నారు.
బల్దియా సిబ్బందికీ ముప్పే..
చెత్తకుప్పల్లోని బయో వ్యర్థాలను వాహనాల్లో డంప్‌యార్డుకు తరలించడం పారిశుధ్య కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడటమే అని అంటున్నారు. రక్షణ పరికరాలు లేకుండా పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బంది.. చెత్తను ఎత్తే సమయంలో చేతులు, కాళ్లకు సూదులు గుచ్చుకునే ప్రమాదం ఉంది.
ఆస్పత్రులు, ల్యాబ్‌ల నిర్లక్ష్యం
వ్యర్థ నిర్వహణ చట్టం ప్రకారం.. ఆస్పత్రులు, ల్యాబ్‌ల్లో రోజూ వెలువడే వ్యర్థాలను పసుపు, ఎరుపు, నీలం, నలుపు తదితర రంగులు కలిగిన కేటగిరీ డబ్బాల్లో వేయాలి. ఇలా వేసిన తర్వాత కూడా 48 గంటలకు మించి ఆస్పత్రుల్లో నిల్వ ఉంచరాదు. శాసీ్త్రయ పద్ధతిలో రీసైక్లింగ్‌తోపాటు కాల్చేందుకు ప్రత్యేకంగా నెలకొల్పిన కరీంనగర్ లోని వెంకటరమణ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కు పంపించాలి. ఇలా క్రమం తప్పకుండా పంపిస్తున్నారా? లేదా? అనేదానిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీంతోనే రోడ్లపై వ్యర్థాలు పడవేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
రోడ్లపై బయో మెడికల్ వ్యర్థాలు పడేస్తే చర్యలు తీసుకుంటాం. గతంలో కూడా జరిమానా విధించాం. డీఎంహెచ్‌వోతోపాటు బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్వాహకులతో ఆస్పత్రులు, ల్యాబ్ నిర్వాహకులకు నిబంధలు ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు ఉంటాయనేదానిపై కూడా ఇప్పటికే ప్రత్యేకంగా అవగాహన కల్పించాం. డాక్టర్స్ స్ట్రీట్‌పై ప్రత్యేక పర్యవేక్షణ చేపడతాం. నిబంధనలు ఉల్లంఘిస్తే డీఎంహెచ్‌వోకు నివేదిస్తాం. – అరుణశ్రీ, కమిషనర్, రామగుండం
రహదారులపైనే సూదులు.. సిరంజీలు
ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారిన మెడికల్ వ్యర్థాలు
నగరంలో బయో మెడికల్ వేస్ట్ భయం
డేంజర్ జోన్‌గా గోదావరిఖని డాక్టర్స్ స్ట్రీట్
రామగుండం బల్దియాకు సవాల్‌గా మారిన ఆస్పత్రులు, ల్యాబ్‌లు


