బైసాస్‌ రోడ్డుతో మరింత అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

బైసాస్‌ రోడ్డుతో మరింత అభివృద్ధి

May 10 2026 9:46 AM | Updated on May 10 2026 9:46 AM

ప్రభుత్వ విప్‌ విజయరమణారావు

బైపాస్‌ పనులకు శంకుస్థాపన

పెద్దపల్లిరూరల్‌: బైపాస్‌ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడం ద్వారా ఈ ప్రాంత ప్రజల కల సాకారమవుతోందని ప్రభుత్వ విప్‌ విజయరమణారావు అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీకాలేజీ(పెద్దకల్వల) సమీపంలో రూ.82కోట్లతో చేపట్టిన బైపాస్‌ రోడ్డు పనులకు ప్రభుత్వ విప్‌ శనివారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. బైపాస్‌ ద్వారా రాజీవ్‌ రహదారిపై ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని తెలిపారు.

ఒట్టేసి చెబుతున్నా..

‘ఒట్టేసి చెబుతున్నా.. నాకు ఎవరినో కష్ట, నష్టాలకు గురిచేయాలనే ఆలోచనే లేదు.. నా ఆరాటమంతా పెద్దపల్లిని అన్నివిధాలా అభివృద్ధి చేయడమే. రోడ్ల అభివృద్ధిలో ఒకరిద్దరికి కొంత కష్టం, నష్టం జరగొచ్చు.. కానీ ఈ ప్రాంతం ఎంతో ప్రగతి సాధిస్తుందనే విషయాన్ని అందరూ గమనించి రాజకీయాల కతీతంగా సహకరించాలి’ అని కోరారు. ఓదెల మండలం రూపునారాయణపేటలో తన సొంతభూమిలోంచి కూడా రోడ్డు వేశారని గుర్తుచేశారు. పెద్దపల్లిలో కోర్టు భవన సముదాయాల నిర్మాణానికి న్యాయవాదులు సహకరించాలని కోరారు. బైపాస్‌లో తమ స్థలం పోతోందని, న్యాయం చేయాలని పలువురు రైతులు విప్‌ను వేడుకున్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో నిర్వహించిన క్రికెట్‌ ఫైనల్‌మ్యాచ్‌లో విజేతగా నిలిచిన సుల్తానాబాద్‌ మండలం గట్టెపల్లి రూ.50వేల పారితోషికం, రన్నర్‌గా నిలిచిన 9వ వార్డు జట్టుకు రూ.25వేల పారితోషికం, ట్రోఫీ అందజేశారు. నాయకులు బొంకూరి అవినాష్‌, ముత్యాల నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పెద్దకల్వలలో బుషణవేన సమ్మయ్య నిర్మించిన ఇందిరమ్మ ఇంటికి ప్రభుత్వ విప్‌ గృహప్రవేశం చేయించారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్డీవో గంగయ్య, ఆర్‌అండ్‌బీ ఈఈ భావ్‌సింగ్‌, సర్పంచ్‌ నర్ల కనకమ్మ, మున్సిపల్‌ చైర్మన్‌ మల్లయ్య, నాయకులు పెగడ రమేశ్‌, అర్కుటి సంతోష్‌, తిరుపతి, సంపత్‌ తదితరులు ఉన్నారు.

కాంగ్రెస్‌తోనే సొంతింటి కల సాకారం

కాల్వశ్రీరాంపూర్‌: కాంగ్రెస్‌ సర్కార్‌తోనే పేదల సొందింటికల సాకారమవుతోందని ప్రభుత్వ విప్‌ విజయరమణారావు అన్నారు. కాల్వశ్రీరాంపూర్‌ మండలం పెగడపల్లిలో సిరిసేటి సుజాత – సతీశ్‌ దంపతుల ఇందిరమ్మ గృహప్రవేశంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్‌, సర్పంచ్‌ ఆరెల్లి రమేశ్‌, ఉప సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement