జ్యోతినగర్/కోల్‌సిటీ: నిరంతర ప్రజా సేవే లక్ష్యంగా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు రామగుండం మేయర్ మహంకాళి స్వామి అన్నారు. గురువారం 34వ డివిజన్ కృష్ణానగర్‌లో వార్డు బాటలో కార్పొరేటర్ స్వప్నప్రియతో కలిసి పర్యటించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ, శానిటేషన్ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా మురుగుకాలువల్లోని పూడిక తొలగించడం జరిగిందన్నారు. నాలాలపై ఉన్న ఆక్రమణలు తొలగించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. డివిజన్‌లలో ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచనల మేరకు శానిటేషన్ డ్రైవ్ నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని పేర్కొన్నారు. రామగుండంను అద్భుత నగరంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్పొరేటర్లు వెంగల బాపు, కొలని కవితారెడ్డి, నాయకులు భరత్‌గౌడ్, రాంబాబు, సాగి శంకర్‌రావు, అధికారులు షాభాజ్, టీపీఎస్ నవీన్, వార్డు అధికారి బీచుపల్లి తిరుపతి, జవాన్ సూర్య తదితరులు పాల్గొన్నారు.
పకడ్బందీగా ప్లాస్టిక్ నిషేధం
నగరంలో ప్లాస్టిక్ నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలని మేయర్ మహంకాళి స్వామి ఆదేశించారు. గురువారం నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. నగరంలో పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యానికి తోడు ప్లాస్టిక్ కారణంగా స్థానికులు క్యాన్సర్ వంటి రోగాల బారినపడుతున్నారన్నారు. ప్రతీ వ్యాపార సంస్థ వద్ద ప్లాస్టిక్ నిషేధంపై బోర్డులు ప్రదర్శించాలని, ఉల్లంఘించినవారి నుంచి జరిమానా వసూలు చేయాలని ఆదేశించారు. ప్లాస్టిక్ నిషేధం అమలులో చురుగ్గా పని చేసినవారికి ప్రోత్సహకం ఉంటుందన్నారు. నగరపాలక సంస్థ ఏసీపీ శ్రీహరి, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.


