మంథనిరూరల్: జిల్లాలో 2025–26 విద్యా సంవత్సరం ముగిసింది. వేసవి సెలవులు ప్రకటిస్తూ జిల్లా విద్యాశాఖ ప్రకటన చేసింది. రెండు నెలల పాటు ప్రభుత్వ పాఠశాలలు మూసిఉండనున్నాయి. అయితే, వాటి ఆస్తులు భద్రంగా ఉంటాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేదిఽశగా సర్కారు అడుగులు వేస్తున్న క్రమంలో.. అనేక విలువైన పరికరాలను అందజేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వేసవి సెలవుల్లో పాఠశాలల్లోని ఆస్తుల పరిరక్షణ ఆ శాఖ అధికారులకు సమస్యగా మారినట్లు తెలుస్తోంది.
పీఎంశ్రీ పాఠశాలలు మినహా..
జిల్లాలో పీఎంశ్రీ పథకం కింద ఎంపికై న ప్రభుత్వ పాఠశాలలు మినహా మిగతా స్కూళ్లలో ఆస్తులకు భద్రత సమస్యగా మారింది. జిల్లావ్యాప్తంగా 832 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. అందులో ఏడు పీఎంశ్రీకింద ఎంపికయ్యాయి. వీటిలో సీసీకెమెరాలు ఏర్పాటు చేశారు. అటెండర్లను నియమించారు. ఒక ఉపాధ్యాయుడికి సీసీ కెమెరా పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.
ఆకతాయిలకు అడ్డాగా..
సెలవులు వస్తే చాలు ఆకతాయిలకు ప్రభుత్వ పాఠశాలలే అడ్డాలుగా మారుతున్నాయి. గతంలో అనేక సందర్భాల్లో ప్రభుత్వ పాఠశాలల్లోనే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం, అద్దాలు, కిటీకీలు, తలుపులు ధ్వంసం చేయడంలాంటివి చూసే ఉంటారు. మందుబాబులు సైతం రాత్రి అయితే పాఠశాల ఆవరణలోనే మద్యం తాగుతూ, ఖాళీ బాటిళ్లు అక్కడే పడవేసిన సందర్భాలూ ఉన్నాయి. అలాంటి కార్యకలాపాలకు తావులేకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
పాఠశాలల బలోపేతమే లక్ష్యం
ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు ధీటుగా బలోపేతం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం జిల్లాలోని అనేక స్కూళ్లను అభివృద్ధి చేసింది. నాణ్యమైన విద్యాబోధన అందించేలా చర్యలు చేపట్టింది. ఈక్రమంలో అనేక విలువైన వస్తువులను అందజేసింది. ముఖ్యంగా కంప్యూటర్లు, ఫర్నీచర్, మినరల్‌వాటర్ ప్లాంట్లు, ఎల్‌ఈడీలాంటి వాటిని అందజేసింది. అనేక స్కూళ్లకు అటెండర్ల నియామకం లేకపోవడం, సీసీ కెమెరాలు అమర్చకపోవడంతో ఆస్తు ల భద్రతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
విద్యార్థుల తల్లిదండ్రుల దృష్టి
రెండు నెలల పాటు సెలవులు ఉండటంతో బడుల ఆస్తుల రక్షణపై విద్యార్థుల తల్లిదండ్రులు దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆకతాయిలు రాకుండా చర్యలు తీసుకోవాలని, యువత సైతం ఆ దిశగా అడుగులు వేయాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తమ గ్రామంలో బడిని కాపాడుకుంటేనే తమ పిల్లల భవిష్యత్‌కు బంగారు బాటలు పడుతాయనే ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని పలువురు అంటున్నారు.
పర్యవేక్షణకు ఆదేశాలు
వేసవి సెలవుల్లో ప్రభుత్వ పాఠశాలలపై పర్యవేక్షణ చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయి. అటెండర్లు ఉన్న పాఠశాలల్లో సమస్య లేదు కానీ వారు లేని వాటిపైనే ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ఆస్తులు కాపాడుకునేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. టీచర్లను సైతం తరచూ పర్యవేక్షణ చేయాలని సూచించాం.
– దాసరి లక్ష్మి, మండల విద్యాధికారి, మంథని
పాఠశాలలకు వేసవి సెలవులు
రెండు నెలలపాటు నిర్మానుష్యంగా బడులు
ఆకతాయిలకు అడ్డాలు సర్కారు స్కూళ్లు
కనిపించని పర్యవేక్షణ...రక్షణ చర్యలు
పీఎం శ్రీ పాఠశాలల్లోనే రక్షణ ఏర్పాట్లు


