వాల్టా.. ఉల్టాపల్టా!
యథేచ్ఛగా బోర్ల తవ్వకాలు
అనుమతి లేకుండానే దందా
‘వాల్టా’, జీవో నంబరు 15 ఉల్లంఘన
ముంచుకొస్తున్న వేసవి
జలమట్టం కాపాడకుంటే ముప్పేనంటున్న నిపుణులు
సాక్షి,పెద్దపల్లి:
పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలమట్టం పడిపోకుండా తీసుకునే జాగ్రత్తల్లో భాగంగా ప్రభుత్వం ‘వాల్టా’ను తీసుకొచ్చింది. దీనిప్రకారం అనుమతి లేనిదే ఇసుక తీయరాదు. బోర్లు తవ్వకూడదు. కానీ జిల్లాలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. జిల్లాలోని పలు బల్దియాలు, మండల కేంద్రాల్లో ఎక్కడ చూసినా రిగ్గుల మోతతో విచ్చల విడిగా బోర్ల తవ్వకం సాగడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. తద్వారా బోర్ల అనుమతి, వాటర్ యూజర్ చార్జీ రూపంలో ప్రభుత్వం రూ.కోట్ల ఆదాయం కోల్పోతోంది. ప్రస్తుతం జిల్లాలో భూగర్భజలాలు సేఫ్ జోన్‌లోనే ఉన్నా.. బోర్ల తవ్వకాలను నియంత్రించకుంటే వేసవిలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
2002లో అమలులోకి వచ్చిన ‘వాల్టా’ ప్రకారం గృహ, వ్యవసాయ, కమర్షియల్ బోర్ల తవ్వకాలకు అనుమతి తీసుకోవాలి. ఈ నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం జీవో నంబరు 15 జారీచేసింది. దీనిప్రకారం నిర్ణీత ఫీజు చె ల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. గ్రౌండ్ వా టర్ అధికారులు బోరు పాయింట్ పరిశీలించి ఫీజు బులిటీ రిపోర్ట్, ఎన్‌వోసీని జారీచేస్తారు. దానిఆధారంగా రెవెన్యూ, మున్సిపల్ యంత్రాంగం బోరు తవ్వకానికి అనుమతి జారీచేయాలి. వ్యవసాయ బోర్లు, నివాసాలకు రూ.వెయ్యి, అపార్ట్‌మెంట్లు, ఆస్పత్రులు, హోటళ్లు, కాలేజీలు, స్కూల్స్, వాటర్‌ప్లాంట్స్ వంటి కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌కు రూ.10వేలు చెల్లించాలి. మిగతా ఇండ్రస్టీస్‌కు కేటగిరీని బట్టి నిర్ణీత ఫీజు చెల్లించాలి. ఐదేళ్లకోసారి రూ.5వేలు చెల్లించి ఎన్‌వోసీ రెన్యూవల్ చేసుకోవాలి. పరిశ్రమలైతే రూ.10వేల ఫీజు చెల్లించడంతోపాటు మూడేళ్లకోసారి రెన్యూవల్ చేసుకోవాలి. ఇళ్లు, వ్యవసాయ బోర్లకు మినహాయింపు ఇచ్చింది. కానీ క్షేత్రస్థాయిలో ఈ నిబంధనలు ఎక్కడా అమలు కావడంలేదు.
గనులు, రైస్‌మిల్లులు, స్కూల్స్
జిల్లాలోని గ్రానైట్, రైస్‌మిల్లులు, వాటర్ ప్లాంట్లు, కమర్షియల్ బిల్డింగ్‌లు ఎన్‌వోసి తీసుకోవడంలేదు. జిల్లాలో 24 గ్రానైట్ క్వారీలు, 46 స్టోన్ క్రషర్లు, 218 బాయిల్డ్ రైస్ మిల్లులు, 104 వాటర్ ప్లాంట్లు, 258 ఇటుక బట్టీలు, 248 ప్రైవేట్ విద్యా, వైద్య సంస్థలు, 59 ఇతర పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో కేవలం 100లోపు సంస్థలే అనుమతులు తీసుకున్నాయి.
మరింత లోతుకు తవ్వి
పంటలు ఎండిపోతున్నాయనే కారణంతో రైతులు బోర్లు వేస్తుండగా, ఇళ్ల నిర్మాణాల కోసం యజమానులు, వెంచర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు రియల్టర్లు ఇష్టారీతిన బోర్లు తవ్వుతున్నారు. జిల్లాలో రోజూ పాతిక వరకు బోర్లు వేస్తున్నారు. రామగుండం కార్పొరేషన్ సహా పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో ఇళ్ల ని ర్మాణం జోరుగా సాగుతోంది. ప్రతీ ఇంటికి బోరు వేశాకే పనులు ప్రారంభిస్తున్నారు. వెంచర్లు ఏర్పాటు చేస్తున్న రియల్టర్లు రోడ్లు, మురుగునీటి కాలువల నిర్మాణంతోపాటు వెంచర్లలో అభివృద్ధి పనుల కోసం బోర్లు యథేచ్ఛగా తవ్విస్తున్నారు. ఫలితంగా బోర్లసంఖ్య భారీగా పెరిగిపోతుంది.
నోటీసులు జారీచేస్తాం
బోరు ఏర్పాటుకు గ్రౌండ్ వాటర్ శాఖ నుంచి ఎన్‌వోసీ, రెవెన్యూ, మున్సిపల్ నుంచి అనుమతి తీసుకోవాలి. అనుమతిలేని వాటిని గుర్తించి నోటీసులు జారీ చేస్తాం. రిగ్గు యజమానులకు జరిమానా విధిస్తాం. – లావణ్య, జిల్లా భూగర్భ జల వనరుల శాఖ అధికారి
వాల్టా.. ఉల్టాపల్టా!


