పల్లె మురవాలి..
పట్నం మెరవాలి
పెద్దపల్లి: గ్రామ పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, కౌన్సిలర్లు, చైర్‌పర్సన్లు, కార్పొరేటర్లు, మేయర్లు పనులు తమ ఏరియాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఇన్నాళ్లూ గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో పేరుకుపోయిన సమస్యలు పరిష్కారమవుతాయని జిల్లావాసులు భావిస్తున్నారు.
ఇబ్బందులు కాకుండా చూడాలి
జిల్లాలోని కొన్నిగ్రామాల్లో వైకుంఠధామాలు వినియోగంలో లేవు. చెట్లు పెరిగి ఎందుకూ పనికి రాకుండా తయారయ్యాయి. స్నానాల గదులు శిథిలావస్థకు చేరాయి. మరమ్మతులు చేస్తే వినియోగంలోకి వస్తాయంటున్నారు.
తడి, పొడి చెత్త
పట్టణాలు, గ్రామాల్లో చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేసేందుకు సెగ్రిగేషన్ షెడ్లు నిర్మించారు. కొద్దికాలం తయారీ బాగానే ఉన్నా ప్రస్తు తం నిర్వహణ విస్మరించారు. శివారుల్లో వ్యర్థాలను పారబోసి నిప్పు పెడుతున్నారు. ఎరువు తయారు చేస్తే ఆదాయం సమకూరుతుందని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు.
నిరుపయోగంగా క్రీడాప్రాంగణాలు
యువతకు క్రీడలపై ఆసక్తి పెంచడమే లక్ష్యంగా గత ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా 452 పైగా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. కొన్నిచోట్ల ఇవి నిరుపయోగంగా మారాయి. వీటిని అందుబాటులోకి తీసుకు రావాలని యువత కోరుతోంది.
పల్లెప్రకృతి వనంలో మొక్కలు కాపాడాలి
పల్లె ప్రకృతి వనాలల్లో మొక్కలకు సిబ్బంది నీరుపట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. చాలాచోట్ల మొక్కలు ఎండిపోతున్నాయి. మరోవైపు.. డ్రైనేజీల్లో పూడిక పేరుకుపోతోంది. ఆయా ప్రాంతా ల్లో చెత్తాచెదారం నిలిచి దోమలు వృద్ధి చెందుతున్నాయి. దోమల నివారణకు మందులు పిచికారీ ప్రారంభించి.. డ్రైనేజీలను శుభ్రం చేయడం, బ్లీచింగ్ పౌడర్ చల్లించడం, రక్షిత మంచినీటిపైప్‌లైన్‌ల లీకేజీలు అరికట్టడం తదితర పనులు పూర్తి చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు.


