కొండగట్టు!
త్వరలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మైనింగ్
రూ.వేల కోట్ల మేర మైనింగ్ పెట్టుబడులు
ఇక్కడే వనాడియం, టైటానియం ప్రాసెస్ కేంద్రాలు
దానికి అనుబంధంగా పలు పరిశ్రమలు
పెరగనున్న లాజిస్టిక్, ఉపాధి అవకాశాలు
మారనున్న
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
ఇంతకాలం ఉమ్మడి కరీంనగర్ జిల్లా బొగ్గు, గ్రానైట్, ఇసుక లాంటి మైనింగ్‌ల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. సింగరేణి బొగ్గు దేశీయంగా, గ్రానైట్ ఉత్పత్తులు అంతర్జాతీయంగా కరీంనగర్ ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపజేస్తోంది. తాజాగా ఈ జాబితాలో మరికొన్ని మూలకాలు చేరనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా లభించే అరుదైన రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (ఆర్ఈఈ) కావడంతో జాతీయస్థాయిలో పలు మైనింగ్ కంపెనీల కన్ను జిల్లాపై పడింది. రాష్ట్రంలో అరుదైన మూలకాల అన్వేషణకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (ఆర్ఈఈ) మైనింగ్ కోసం దేశవ్యాప్తంగా 11 బ్లాకులను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) గుర్తించింది. అందులో తెలంగాణలోని రెండు బ్లాకుల్లో ఒకటి కొండగట్టు సమీపంలో ఉండటం స్థానికంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మూలకాలను తవ్వి తీసుకునేందుకు కావాల్సిన ఎక్స్ ప్లోరేషన్ సర్టిఫికెట్ కోసం కేంద్రం ఇటీవల ఫిబ్రవరి 17న ప్రారంభించిన ఈ బిడ్డింగ్‌లో ఏప్రిల్ 10 వరకు పాల్గొనేందుకు పలు మైనింగ్ కంపెనీలకు కేంద్ర గనుల మంత్రిత్వశాఖ అవకాశం కల్పించింది. ఇక్కడ మైనింగ్ మొదలైతే కొండగట్టే కాదు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్వరూపమే మారిపోనుంది.
టైటానియం, వనాడియం బ్లాకులు
ప్రపంచవ్యాప్తంగా రక్షణ, ఆరోగ్య, మెడికల్, ఐటీ తదితర రంగాల్లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మార్కెట్‌కు మంచి డిమాండ్ ఉంది. ఈ రంగంలో చైనా, అమెరికా ప్రపంచ విపణిలో అగ్రగామిగా ఉన్నాయి. భారత్ కూడా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (ఆర్ఈఈ) అన్వేషణకు రంగం సిద్ధం చేసుకుంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ఆధ్వర్యంలో సిరిసిల్ల– జగిత్యాల జిల్లాల సరిహద్దులోని కొండగట్టు సమీపంలో టైటానియం, వనాడియం బ్లాకును గుర్తించింది. ఇది 202.29 చదరపు కి.మీ మేర విస్తరించి ఉంది. ప్రస్తుతం ఎక్స్‌ప్లోరేషన్ సర్టిఫికెట్ పొందిన మైనింగ్ సంస్థలు ఇక మైనింగ్ ప్రారంభించనున్నాయి. టైటానియం చాలా బలమైనలోహం. దీని మిశ్రమలోహాలు తేలికై నవి, పలు రకాలుగా వినియోగించుకునే వీలున్నవి. వీటితో తయారయ్యే ఉపకరణాలను వైమానిక, రక్షణ, పెట్రోకెమికల్స్, మెడికల్, ఆటోమోటివ్, క్రీడా, జెవెల్లరీ, పారిశ్రామిక రంగాల్లో వినియోగిస్తుంటారు. ఇక వెనీడియం అంతర్జాతీయ మార్కెట్లో ఎంతో డిమాండ్ కలిగి ఉంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల్లో వనాడియం కీలకం. ఇది స్థానిక పారిశ్రామిక రంగం అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది. న్లూక్లియర్ పరిశోధనలకు, రక్షణ, గ్లాసు, స్టీలు ఉత్పత్తి, జీవశాస్త్ర పరిశోధనల్లోనూ దీనికి ప్రాధాన్యం ఉంది.


