సమస్యలు అప్‌డేట్
పత్తి క్రయ, విక్రయాల్లో రైతులకు తిప్పలు మొన్న నిలిచిన కొనుగోళ్లు.. నిన్న అతికష్టం మీద అమ్మకాలు అన్నదాతల ‘యాప్’ సోపాలు
పెద్దపల్లిరూరల్: రైతుల నుంచి పంట ఉత్పత్తులను మద్దతు ధరతో సాఫీగా కొనుగోలు చేసేందుకు కేంద్రప్రభుత్వం పలు యాప్‌లను అందుబాటులోకి తీ సుకొస్తోంది. ఇందులో సాగు వివరాల కోసం ‘క్రాప్ బుకింగ్ యాప్’, యూరియా కోసం ‘వి’ యాప్, పత్తి దిగుబడి విక్రయానికి ‘కపాస్’ యాప్ రూపొందించింది. అత్యధికమంది రైతులు నిరక్షరాస్యులే కావడం, వారి కుటుంసభ్యులు మార్కెట్‌కు వెళ్లకపోవడం, యాప్‌లో వివరాలు నమోదు చేసేందుకు మొబైల్ ఫోన్‌కు వచ్చే ఓటీపీలను అధికారులకు చెబితే నష్టాలేమైనా జరుగుతాయా? అనే సందేహాలు రైతులను వెంటాడుతున్నాయి. ఫలితంగా కేంద్ర సర్కార్ ఆశయం నెరవేరడంలేదు.
మొన్న నిలిచిన పత్తి కొనుగోళ్లు..
వ్యవసాయ మార్కెట్లలో దిగుబడి అమ్మేందుకు అమలవుతున్న ‘నామ్’ విధానంలో ఇప్పటివరకు ఉన్న సాఫ్ట్‌వేర్‌ను లేటెస్ట్ వర్షన్‌కు ఇటీవల బదలాయించారు. దీంతో పత్తి విక్రయించేందుకు అన్నదా తలు అవస్థలు పడాల్సివస్తోంది. తాజాగా అప్‌డేట్ చేసిన సాఫ్ట్‌వేర్ పనిచేయక బుధవారం పెద్దపల్లి మార్కెట్‌లో కొనుగోళ్లు నిలిచిపోయాయి. గురువా రం కూడా అదేపరిస్థితి పునరావృతమైంది. రెండ్రోజులపాటు పత్తి నిల్వలు పెరిగిపోవడంతో మార్కెటింగ్ అధికారులే ప్రత్యామ్నాయంగా ఎక్సెల్ షీట్ రూపొందించుకుని పత్తి కొనుగోలు చేయడంతో సమస్య తాత్కాలికంగా పరిష్కారమైంది.
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో అవస్థలు
వ్యవసాయ మార్కెట్లలో ఈ నామ్ పద్ధతి ఇప్పటికే అమల్లో ఉంది. దీని పర్యవేక్షణ బాధ్యతలను ఇప్పటివరకు నాగార్జున ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్‌ఎఫ్‌సీఎల్) కాంట్రాక్టు పద్ధతిన నిర్వహించింది. తాజాగా అప్‌డేట్ చేసిన సాఫ్ట్‌వేర్ నిర్వహణ బా ధ్యతను స్మాల్ ఫార్మర్స్ అగ్రిబిజినెస్ కన్‌స్ట్రిమ్(ఎన్‌ఎఫ్‌సీఎల్)కు అప్పగించింది. ఇందులో రైతు, తండ్రి పేరు, పిన్‌కోడ్ నంబరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబరు, దిగుబడి తీసుకొచ్చే వాహనం వివరాలను ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేయాల్సి ఉంది. గతే డాది నవంబర్ నుంచే ఈపద్ధతిని ప్రయోగాత్మకంగా అమలు చేయాల్సి ఉన్నా.. రాష్ట్ర వ్యాప్తంగా ‘ఈ నామ్’ అమలయ్యే మార్కెట్లలో పనిఒత్తిడి, సిబ్బంది కొరతతో ఈ పద్ధతి అమలు చేయలేడం లేదని సమాచారం. దీంతో పాతవిధానాన్ని ఈనెల 24 నుంచి ఉన్నతాధికారులు నిలిపివేశారు. తద్వారా బుధవారం నుంచి సమస్య మొదటికొచ్చింది.
క్వింటాల్ పత్తి రూ.7,468
పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో గురువారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,468 ధర పలికిందని మార్కెట్ కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. కనిష్టంగా రూ.5,501, సగటు రూ. 7,121గా ధర నమోదైందన్నారు. పలు ప్రాంతాలకు చెందిన 509 మంది రైతుల నుంచి 1,372 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు.


