మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే జైలుకే..
పెద్దపల్లిరూరల్: మద్యం తాగి ఆ మత్తులో వాహనాన్ని రోడ్డుపై రయ్‌రయ్‌మంటూ నడుపుకుంటూ పోయే మందుబాబులు ట్రాఫిక్ పోలీసులకు చిక్కితే జైలుకెళ్లడం ఖాయమే. మద్యం మత్తులో వాహనాలను నడుపుతూ రోడ్లపై తిరిగి ప్రమాదాలకు కారకులు కావొద్దనే ఆలోచనతో చట్టపరంగా కఠినశిక్షలను విధిస్తున్నారు. పెద్దపల్లి పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు ఇటీవల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 30 మందిని బుధవారం స్థానిక కోర్టులో హాజరుపర్చారు. విచారణ జరిపిన సెకండ్‌క్లాస్ ఇన్‌చార్జి జడ్జి మంజుల.. పెద్దపల్లి శాంతినగర్ ఒకరికి ఒకరోజు, సుల్తానాబాద్ మండలం గట్టెపల్లికి చెందిన మరొకరికి 4రోజులు, పెద్దపల్లి శివారు బందంపల్లికి ఇంకొకరికి 5రోజుల జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చారని ట్రాఫిక్ సీఐ అనిల్‌కుమార్ తెలిపారు. మిగతా 27 మందికి రూ.34,800 జరిమానా విధిస్తున్నట్లు తీర్పులో పేర్కొన్నారని సీఐ వివరించారు.
జాతరకు తరలిరండి
గోదావరిఖని: ముర్మూర్ కొమురన్న జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని జాతర నిర్వాహకుడు గోపు ఐలయ్య యాదవ్ కోరారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పునర్నిర్మాణం చేసిన ఆలయంలో మార్చి ఒకటి, రెండో తేదీల్లో విగ్రహ ప్రతిష్ఠాపన, జాతర ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తామని అన్నారు. మేకల కొమురయ్య, అశోక్, జక్కుల తిరుపతి, అల్లం ఐలయ్య, రాగం శ్రీనివాస్ పాల్గొన్నారు.


