రాజన్న వైభవం.. మరింత శోభితం
పనులు త్వరగా పూర్తి చేస్తాం
● ఉడెన్ బెల్లీస్‌తో బేస్ ● మార్చి చివరికి పిల్లర్ స్థాయి
● ఆలయ దక్షిణ రోడ్డు బ్లాక్ చేసి పనులు వేగవంతం ● నిర్మాణదశలో దర్గా
వేములవాడ: వేములవాడ రాజన్న ఆలయానికి శాశ్వత వైభవం తీసుకొచ్చే దిశగా రూ.150 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. ఏళ్ల చరిత్ర గల వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ పరిసరాల్లో చేపట్టిన పనులు కీలక దశకు చేరుకున్నాయి. మార్చి నెలాఖరు వరకు పిల్లర్ స్థాయికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజన్న ఆలయ వైభవానికి మరింత శోభ తెచ్చేలా పనులు చేపడుతున్నారు.
ఉడెన్ బెల్లీస్‌తో బేస్
ప్రఖ్యాత భవన నిర్మాణ కాంట్రాక్టర్ శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధిలో భాగంగా ఉడెన్ బెల్లీస్‌తో బలమైన బేస్ నిర్మాణం పూర్తయింది. ఎన్ని సంవత్సరాలైనా పాడవని కర్రలను పిల్లర్ల కింది ప్రాంతంలో అమర్చినట్లు వెల్లడించారు. దీంతోపాటు సంప్రదాయ శిల్పకళకు అనుగుణంగా, భద్రతా ప్రమాణాలు పాటిస్తూ చేపట్టిన ఈ బేస్ పనులు ఆలయ సౌందర్యానికి మరింత శోభను తీసుకొస్తాయని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు.
దక్షిణ రోడ్డు బ్లాక్ చేసి పనులు
మార్చి నెలాఖరి వరకు పిల్లర్‌స్థాయికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయి. రెండు రోజుల క్రితం ఆలయ దక్షిణ రోడ్డును బ్లాక్ చేసి పనులు చేపడుతున్నారు. పిల్లర్ల నిర్మాణం పూర్తయ్యాక పైభాగం నిర్మాణానికి మార్గం సుగమం కానుంది. భక్తులు ఎంత మంది వచ్చినా ఇబ్బందులు కలగకుండా దశలవారీగా పనులు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ఆలయ అభివృద్ధితోపాటు వసతుల మెరుగుదలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ పనులు పూర్తయ్యాక భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం లభించడంతోపాటు వేములవాడ ఆధ్యాత్మిక క్షేత్రంగా మరింత వెలుగొందనుంది.
నిర్మాణ దశలో దర్గా
ఆలయంలోని దర్గాను తొలగించి బయట ప్రాంతంలో నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ఎలాంటి విభేదాలకు తావులేకుండా పనులు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలోకి ఎవరినీ అనుమతించడం లేదు. పకడ్బందీగా పనులు చేస్తున్నారు.
ఆలయ పనులను త్వరగా పూర్తి చేసేందుకు ఈనెల 24న హైదరాబాద్‌లో మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. నిధులకు కొరత లేకుండా పనులు ముమ్మరం చేయాలని ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, సాంప్రదాయ పద్ధతుల్లో పనులు కొనసాగుతున్నాయి. శృంగేరి పీఠాధిపతుల ఆదేశాల మేరకే పనులు జరుగుతున్నాయి. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
– ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్
రాజన్న వైభవం.. మరింత శోభితం
రాజన్న వైభవం.. మరింత శోభితం
రాజన్న వైభవం.. మరింత శోభితం


