అభివృద్ధికి ఓటెయ్యండి
సాక్షి పెద్దపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం
రెండేళ్లల్లో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసిఓటు వేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కోరారు. సీఎం రేవంత్‌రెడ్డితో తనకున్న సాన్నిహిత్యంతో ఇప్పటికే నియోజకవర్గానికి రూ.1,000కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. భవిష్యత్‌లోనూ నిధులు భారీగా తీసుకొచ్చి పెద్దపల్లి, సుల్తానాబాద్‌ను ఆదర్శ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దుతానని ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అధికార పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే మరింత అభివృద్ధి సాధ్యమన్నారు. ఆయన మాటల్లోనే..
ఎన్నికల ప్రచారం ఎలా జరిగింది. ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది?
ఎమ్మెల్యే: గత పదేళ్లలో కాని అభివృద్ధి రెండేళ్లల్లో చేశాం. అనేక సంక్షేమ పథకాలను అమలు చేశాం. ప్రజల్లో సానుకూలత కనిపిస్తుంది. అభివృద్ధి, సంక్షేమ ఫలాలను గడపగడపకూ తీసుకెళ్లాం. పెద్దపల్లి, సుల్తానాబాద్‌లో మెజార్టీస్థానాలు కై వసం చేసుకుని కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం.
పెద్దపల్లిలో మీరు చేసిన అభివృద్ధి ఏమిటి?
ఎమ్మెల్యే: పట్టణ అభివృద్ధికి రూ.77.50 కోట్లు వెచ్చించాం. బస్సు డిపో ఏర్పాటు, బైపాస్‌రోడ్డు, కోర్టు భవన నిర్మాణం, 50 పడకల నుంచి 100 పడకలకు ప్రభుత్వ ఆస్పత్రి ఆధునికీకరణ, సీటీస్కాన్, ఎంఆర్‌ఐ అందుబాటులోకి తీసుకొచ్చాం. నేను ఎమ్మెల్యేగా గెలిచిన రెండేళ్లలో రూ.40 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాం. వసతులు కల్పించాం. పట్టణ ప్రజల దాహం తీర్చేందుకు ఆర్డీవో కార్యాలయంలో కొత్తగా వాటర్ ట్యాంక్, చందపల్లి డబుల్‌బెడ్రూమ్ ఇళ్ల ప్రాంతంలో వాటర్ ట్యాంక్ నిర్మిస్తున్నాం. రూ 62.50 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించాం, మరో రూ.15 కోట్లు మంజూరు చేయించాం. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఆధునికీకరణ కోసం రూ.7.5 కోట్లు కేటాయించాం. క్రీడల కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాం. వ్యవసాయ మార్కెట్‌లో ఇండోర్ బ్యాడ్మింటన్ షటిల్ స్టేడియం నిర్మాణానికి డీఎంఎఫ్‌టీ నుంచి రూ.2.5 కోట్లు కేటాయించి పనులు చేపట్టాం.
గెలిస్తే సుల్తానాబాద్‌ను ఎలా అభివృద్ధి చేస్తారు?
ఎమ్మెల్యే: సుల్తానాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ లక్ష్యం. గత పాలకులు తరలించిన కార్యాలయాలను వెనక్కి తీసుకొచ్చా. రెండేళ్లలోనే రూ.20 కోట్లతో అభివృద్ధి చేశాం. రూ.15 కోట్లతో పనులు జరుగుతున్నాయి. రూ.8.50కోట్ల పెద్దచెరువును మినీట్యాంక్ బండ్ మార్చుతాం. ఐబీపాత భవనం కూల్చివేసి రూ.4కోట్లతో కొత్త భవనం నిర్మిస్తాం. రూ.4కోట్లతో కొత్త బస్టాండ్ కట్టిస్తాం. పాత భవనాలు తొలగించి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం. వర్షపు నీరు బయటికి వెళ్లేలా చర్యలు తీసుకుంటాం. అంబేడ్కర్ కాంశ్య విగ్రహం సొంతఖర్చులతో ఏర్పాటు చేస్తా. రూ.65 లక్షలతో ఇటీవల షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాం. తెలంగాణ చౌరస్తా – గట్టపల్లి క్రాసింగ్ వరకు రూ.7.50 కోట్లతో సెంట్రల్ లైటింగ్ సిస్టం చేపడతాం.
బీఆర్‌ఎస్, బీజేపీలలో మీకు దేనితో పోటీ అని భావిస్తున్నారు?
ఎమ్మెల్యే: బీఆర్‌ఎస్, బీజేపీలకు అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉంది. పదేళ్ల బీఆర్‌ఎస్.. పట్టణ అభివృద్ధిని గాలికొదిలేసింది. 8 మంది ఎంపీలను గెలిపించిన బీజేపీ.. కేంద్రం నుంచి రాష్ట్రానికి తెచ్చిన నిధులు సున్నా. అందుకే రాష్ట్రంలో అధికారంలో ఉన్న మా పార్టీ అభ్యర్థులనే కౌన్సిలర్లుగా గెలిపిస్తే అభివృద్ధి సాధ్యం. ఈవిషయాన్ని గుర్తించి ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని కోరుతున్నాం.
అభివృద్ధికి ఓటెయ్యండి


