రూ.200 పుచ్చుకో... జెండా పట్టుకో !
వేములవాడ: మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ, పొలిమేర గ్రామాల్లోని మహిళలకు ఉపాధి పుష్కలంగా లభిస్తుంది. నామినేషన్లపర్వం ముగిసిపోయి బుధవారం నుంచి ప్రచారం ప్రారంభమైంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బరిలో నిలిచిన అభ్యర్థులు వార్డుల్లో ప్రచారం చేస్తున్నారు. ఈక్రమంలో తన వెంట ఎక్కువ మంది కనిపించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. స్థానిక మహిళలతోపాటు పొరుగున్న ఉన్న పల్లెల నుంచి రూ.200 చొప్పున కూలీ చెల్లించి తమ వెంట ప్రచారానికి తెచ్చుకుంటున్నారు. వారు జెండా పట్టుకొని అభ్యర్థులు వెనుక ఉంటూ.. ‘.. మన అన్నకే ఓటేయాలి’, ‘అన్న గెలుపుతోనే వార్డు అభివృద్ధి’ అంటూ నినాదాలు చేయా లి. వీరు వచ్చిపోయేందుకు ఆటోలు పెడుతున్నారు. ప్రచారానికి వచ్చిన వారికి అభ్యర్థి ఇంటి వద్ద లేదా తన వార్డు ఆఫీస్ వద్ద భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. పురుషులు ప్రచారానికి వస్తే అదనంగా మందు ఖర్చు చేస్తున్నారు. దీంతో పట్టణంలోని చికెన్, మటన్ సెంటర్ల వద్ద గిరాకీ పెరిగింది. సాధారణ రోజులతో పోల్చితే ఇప్పుడు బిర్యానీ ఆర్డర్లు రెట్టింపయ్యాయని బిర్యానీ సెంటర్ నిర్వాహకులు తెలిపారు.


