క్యాన్సర్ నివారణపై అవగాహన ఉండాలి
పెద్దపల్లి: క్యాన్సర్‌పై అవగాహన ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. వైద్య ఆరోగ్యశాఖ సూచించిన క్యాన్సర్ నివారణ చర్యలపై విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలని, వాటిని ఆచరించి కుటుంబ సభ్యులకు కూడా తెలుపాలని సూచించారు. బాలికలు, మహిళలు ప్రతి నెల స్వయంగా బ్రెస్ట్ స్క్రీనింగ్ చేసుకోవాలని, ఏవైనా అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో సంప్రదించాలన్నారు. వ్యాయామం, యోగా సాధన నిత్యజీవితంలో భాగం చేసుకోవాలన్నారు. డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ మాట్లాడుతూ, క్యాన్సర్‌కు ప్రధాన కారణాలైన పొగాకు ఉత్పత్తులు, మద్యం తాగడం మానుకోవాలన్నారు. సెల్‌ఫోన్ వినియోగం తగ్గించి, హెపటైటిస్–బి, హెచ్‌పీవీ టీకాలు వేయించుకోవాలని తెలిపారు. ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో మొదటిసారి కీమోథెరపీ చేయించుకున్న రోగులకు తదుపరి కీమోథెరపీ చికిత్స అందించేందుకు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, రామగుండంలో 10 పడకలతో క్యాన్సర్ కేర్ వార్డు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అకస్మాత్తుగా బరువుతగ్గడం, ఎడతెగని దగ్గు, కంతులు పెరగడం, దగ్గినప్పుడు లేదా విసర్జన సమయంలో రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో సంప్రదించాలని సూచించారు. జిల్లా ప్రోగ్రాం అధికారి, డాక్టర్లు రాజమౌళి, లక్ష్మీభవాని, ఎన్.శ్రీనివాస్, ఎం.బాలకృష్ణ, కె.సంకీర్తన, ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


