రాష్ట్రంలో అరాచక పాలన
గోదావరిఖని/ఫెర్టిలైజర్‌సిటీ: రాష్ట్రంలో అరాచకపాలన కొనసాగుతోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గురువారం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో రామగుండంలోని 23,52,53,54, 55,41,35వ వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో ప్రజలను ఆశపెట్టి గద్దెనెక్కిందన్నారు. ప్రజలు ఆశపడడం తప్పు కాదని, వారిని మోసం చేయడం కాంగ్రెస్ తప్పన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడిచినా ప్రజలకు చేసిందేమీ లేదని, రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేరని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో రౌడీల పాలనకు చరమగీతం పాడాలని కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. అభివృద్ధి పేరిట విధ్వంసం జరుగుతోందన్నారు. రాత్రి పూట దొంగల వలె మైసమ్మ ఆలయాలు, దుకాణాలు కూల్చడం ఇక్కడ నిత్యం జరుగుతుందన్నారు. రామగుండంలో నియంత పాలన పోవాలంటే బీఆర్‌ఎస్ గెలుపుతోనే సాధ్యమన్నారు. అభ్యర్థులను పోలీసులతో బెదిరిస్తూ విత్ర్ డ్రా చేయించారని, అబద్ధాలు, మోసాలకు కేరాఫ్‌గా కాంగ్రెస్ నిలిచిందన్నారు. ఓట్లు అడిగేందుకు వచ్చే ఆ పార్టీ నాయకులను ప్రజలు నిలదీయాలన్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమాల్లో నాయకులు మూల విజయరెడ్డి, కౌశిక హరి, నడిపెల్లి మురళీధర్‌రావు, నారాయణదాసు మారుతి, అచ్చే వేణు తదితరులు పాల్గొన్నారు.


