ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు?
సాక్షి పెద్దపల్లి: పదేళ్ల పాలనలో పట్టణాలు, పల్లెలను గాలికొదిలేసిన బీఆర్‌ఎస్ నేతలు.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ఐటీ పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. ఎన్నికలు వస్తే అడ్డగోలుగా మాట్లాడే పార్టీలు బీఆర్‌ఎస్, బీజేపీలకు బుద్ధిచేప్పేలా, అధికార కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి జిల్లా కేంద్రంలో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నమైనా.. కాంగ్రెస్ సర్కార్ గాడిలోపెట్టిందన్నారు. ఒక్కో హామీ అమలు చేస్తోందని తెలిపారు. పెద్దపల్లికి ఐటీ పార్క్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అరకొరగా కట్టి లబ్ధిదారులకు అందించలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మౌలిక సదుపాయాలు క ల్పించి లబ్ధిదారులకు అందించిన ఘనత ఎమ్మెల్యే విజయరమణారావుకే దక్కిందన్నారు. ఐఎన్‌టీయూసీ నేత జనక్‌ప్రసాద్, మాజీ జెడ్పీటీసీ గోపగాని సారయ్యగౌడ్, శశిభూషణ్ కాచే, శ్రీమాన్, తొట్ల తిరుపతియాదవ్ తదితరులు పాల్గొన్నారు.
● అధికారంలో ఉన్నవారిని గెలిపిస్తేనే మరింత అభివృద్ధి
● ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు


