ఘర్షణల నడుమ పంచాయతీ పోరు | - | Sakshi
Sakshi News home page

ఘర్షణల నడుమ పంచాయతీ పోరు

Nov 27 2026 1:56 AM | Updated on Nov 27 2026 1:56 AM

ఘర్షణల నడుమ పంచాయతీ పోరు

సాక్షి, పార్వతీపురం మన్యం:

పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ సమయంలో గురువారం పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కృష్ణపల్లి వద్ద స్వల్ప తోపులాట జరిగింది. గుమ్మలక్ష్మీపురం పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. విశ్రాంత ఉపాధ్యాయుడు రిగ్గింగ్‌ చేస్తున్నాడని.. సీసీ కెమెరాలు పరిశీలించాలని పలువురు అభ్యర్థులు డిమాండ్‌ చేశారు. జియ్యమ్మవలస మండలం తురకనాయుడువలస పోలింగ్‌ కేంద్రం వద్ద టీడీపీ నేతలు, ఇండిపెండెంట్‌ అభ్యర్థి వర్గం మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఇరువర్గాలను పోలీసులు చెల్లాచెదురు చేశారు. సీతానగరం, బలిజిపేట మండలాల్లోనూ స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ సాగింది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలోని పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల పరిధి కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, గరుగుబిల్లి, పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట మండలాల్లో తొలి విడత ఎన్నికలు జరిగాయి. 226 గ్రామ పంచాయతీల్లో 33 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 193 సర్పంచ్‌ స్థానాలకు, 1,146 వార్డు స్థానాలకు పోలింగ్‌ నిర్వహించారు. 1,148 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 2,99,676 మంది ఓటర్లు ఉండగా... పోలింగ్‌ ముగిసే సమయానికి 2,36,097 (78.78 శాతం) మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా సీతానగరం మండలంలో 83.19 శాతం పోలింగ్‌ నమోదు కాగా... అత్యల్పంగా కురుపాం మండలంలో 74.11 శాతం నమోదయింది. ముందు రోజు పరిస్థితుల దృష్ట్యా పార్వతీపురం మండలం ఎం.ఆర్‌.నగరం వద్ద పటిష్ట పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఎన్నికల అధికారులు సర్పంచ్‌, వార్డు సభ్యుల విజేతల ఫలితాలను ప్రకటించారు.

సెల్‌ఫోన్‌ లైటింగ్‌లో కౌంటింగ్‌

బలిజిపేట: పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట ఉన్నత పాఠశాలలో గురువారం పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో విద్యుత్‌ అంతరాయం కలిగింది. సెల్‌ఫోన్‌ లైటింగ్‌లో అధికారులు లెక్కింపును కొనసాగించారు. పోలింగ్‌ కేంద్రం వద్ద జనరేటర్‌ ఏర్పాటుచేయకపోవడంతో సమస్య తలెత్తింది. పోలింగ్‌ ముగిసిన తరువాత కౌంటింగ్‌ ప్రారంభించి వార్డుల కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తయిన తరువాత సర్పంచ్‌ అభ్యర్థికి చెందిన ఓట్లు లెక్కింపు చేసే సమయంలో పది నిమిషాలపాటు విద్యుత్‌ అంతరాయం కలగడంతో అక్కడ ఉన్నవారు సెల్‌ఫోన్‌ లైట్లు కొట్టడంతో అధికారులు విధులు నిర్వహించారు.

– 78.78 శాతం ఓటింగ్‌ నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement