పీహెచ్‌సీల్లో కానరాని డెంగీ కిట్లు..! | - | Sakshi
Sakshi News home page

పీహెచ్‌సీల్లో కానరాని డెంగీ కిట్లు..!

Nov 27 2026 1:56 AM | Updated on Nov 27 2026 1:56 AM

● విలేజ్‌హెల్త్‌ క్లినిక్‌ల్లోనూ అదే పరిస్థితి

● అవస్థలు పడుతున్న రోగులు

● డెంగీ పరీక్షల కోసం జిల్లా కేంద్రానికి పరుగుపెట్టాల్సిన దుస్థితి

● విజయనగరం పట్టణానికి చెందిన శ్రీనివాస్‌ అనే వ్యక్తి ఇస్మాయిల్‌ కాలనీలో ఉన్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాని(యూపీహెచ్‌సీ)కి వెళ్లాడు. అక్కడ డెంగీ పరీక్ష చేయాలని సిబ్బందిని కోరగా డెంగీ కిట్లు లేవని చెప్పడంతో వెనుదిరిగారు.

● విజయనగరం మండలానికి చెందిన సన్యాసిరావు అనే వ్యక్తి రాకోడు పీహెచ్‌సీకి జ్వరంతో వెళ్లాడు. అక్కడ డెంగీ పరీక్ష కిట్లు లేకపోవడంతో జిల్లా కేంద్రాస్పత్రికి వెళ్లాడు.

విజయనగరం ఫోర్ట్‌:

ప్రజారోగ్యాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. చాలా ఆస్పత్రుల్లో మందుబిళ్లలతో పాటు వివిధ వైద్య పరీక్షల కిట్లుకూడా లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర వేళ జిల్లా కేంద్రాస్పత్రితో పాటు ప్రైవేటు ఆస్పత్రులకు పరుగు తీస్తున్నారు. ప్రజారోగ్యాన్ని ప్రభుత్వం గాలికొదిలేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు తాగునీరు కలుషితమైంది. మలేరియా, డెంగీ, వైరల్‌ జ్వరాల వ్యాప్తి అధికంగా ఉంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య భరోసా కల్పించే పీహెచ్‌సీల్లో డెంగీ కిట్లు లేకపోవడంతో వైద్యపరీక్షలకు ఆటంకం కలుగుతోంది. వ్యాధి నిర్ధారణ కాకపోవడంతో వైద్యసేవలు అందడం లేదు. జిల్లా కేంద్రాస్పత్రికి రిఫర్‌ చేస్తున్నారు.

● ఇదీ పరిస్థితి..

జిల్లాలో 50 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ)లు, 18 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యుపీహెచ్‌సీ)లు, 482 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఏ ఒక్కరికి జ్వరం వచ్చినా ముందుగా చికిత్స కోసం విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌, పీహెచ్‌సీనే ఆశ్రయిస్తారు. ప్రస్తుతం ఈ రోడ్డు చోట్ల డెంగీకిట్ల కొరతతో వైద్యపరీక్షలు జరగడం లేదు. గతేడాది కాలంగా పీహెచ్‌సీలకు డెంగీ పరీక్ష కిట్లు సరఫరా కావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మలేరియా కంటే డెంగీ ప్రమాదకరమైనదని, సకాలంలో వ్యాధి నిర్ధారణ కాకపోవడంతో వైద్యసేవలు అందక చాలా మందికి ప్రాణాపాయ పరిస్థితి ఎదురవుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

గతంలో వైద్యభరోసా..

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేసింది. ఊరూరా ఫ్యామిలీ డాక్టర్‌ సేవలతో పాటు విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లను ఏర్పాటుచేసింది. తరచూ ఫీవర్‌ సర్వేలు నిర్వహించేది. ప్రాథమిక స్థాయిలోనే రోగాలను గుర్తించి వైద్యసేవలు అందించేది. అన్నిరకాల ప్రాథమిక వైద్యపరీక్షల కిట్లు అందుబాటులో ఉండేవి. అస్వస్థతకు గురైన వారికి ఊరిగడప దాటకుండానే వైద్యసేవలు అందేవి. రోగులు త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉండేది. ప్రసుత్తం ఆ పరిస్థితి లేదంటూ పలువురు రోగులు చెబుతున్నారు. పీహెచ్‌సీల్లో సేవలు మృగ్యమయ్యాయని చెబుతున్నారు. డెంగీ సోకితే నిర్ధారణ కోసం జిల్లా కేంద్రాస్పత్రికి వెళ్లాల్సివస్తుందని చెబుతున్నారు.

డెంగీ కిట్లు లేవు..

పీహెచ్‌సీల్లో ప్రస్తుతం డెంగీ కిట్లు లేవు. కిట్లు ఉన్నంత వరకు డెంగీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. జిల్లా కేంద్రాస్పత్రిలో డెంగీ నిర్ధారణ పరీక్ష చేస్తున్నారు.

– డాక్టర్‌ ఎస్‌.జీవనరాణి, డీఎంహెచ్‌ఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement