‘కొఠియా’ కన్నీళ్లు కనిపించవా? | - | Sakshi
Sakshi News home page

‘కొఠియా’ కన్నీళ్లు కనిపించవా?

Nov 27 2026 1:56 AM | Updated on Nov 27 2026 1:56 AM

● కూటమి ప్రభుత్వం చేతకాని తనంతోనే ఒడిశా వేధింపులు ● మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర

● కూటమి ప్రభుత్వం చేతకాని తనంతోనే ఒడిశా వేధింపులు ● మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర

సాలూరు: ఆంధ్రాలో ఉన్న చేతకాని కూటమి ప్రభుత్వం, వారి అసమర్థ పాలన వల్లనే ఆంధ్రా, ఒడిశా వివాదాస్పద కొఠియా గ్రూప్‌ గ్రామాల్లో గిరిజనులు అనేక కష్టాలు పడుతున్నారని, తీవ్ర మానసిక హింసకు గురవుతున్నారని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఆయన పట్టణంలోని తన గృహంలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, ఆంధ్రా,ఒడిశా రాష్ట్రాల మధ్య కొఠియా గ్రామాల గిరిజనులు నలిగిపోతున్నారన్నారు. కొఠియా గ్రామాల గిరిజనులకు ఒడిశా నుంచి రక్షణ కల్పించడంలో ఈ కూటమి ప్రభుత్వం, గిరిజనసంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి పూర్తిగా విఫలమయ్యారని విరుచుకుపడ్డారు. కొఠియా గ్రామాల గిరిజనులపై ఒడిశా ప్రభుత్వం వరుసగా వేధింపులకు పాల్పడుతున్పప్పటికీ ఆంధ్రా ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణమని విమర్శించారు. గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం, భద్రతను కాపాడాల్సిన పాలకులే మౌనప్రేక్షకులుగా మిగిలిపోవడం శోచనీయమన్నారు. కొఠియా గ్రామాల గిరిజనుల కన్నీళ్లు ఆంధ్రా పాలకులకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పరిషత్‌, పంచాయతీ ఎన్నికలు జరిగిన సమయంలో ఒడిశా నుంచి ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా ఎక్కడా అరెస్ట్‌లు, కిడ్నాప్‌లకు తావులేకుండా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించిందని గుర్తుచేశారు.

గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారు...

గత నెలరోజులుగా కొఠియా గ్రామాల గిరిజనులపై ఒడిశా అధికారుల వేధింపులు తీవ్రమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తెలుగు, ఇంగ్లీష్‌ మీడియాల్లో వార్తలు వస్తున్నా స్థానిక మంత్రి సంధ్యారాణి, ఆంధ్రాప్రభుత్వం, అధికార యంత్రాంగం ఎవరూ కూడా పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేయాలి

ఈ కూటమి ప్రభుత్వం, అధికారులకు కొఠియా గిరిజనులకు రక్షణ కల్పించడం చేతకాకపోతే కనీసం మానవహక్కుల సంఘానికైనా ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు.గిరిజనులను ఒడిశా ప్రభుత్వం ఇంత వేధింపులకు గురిచేస్తున్నా ఆంధ్రా ప్రభుత్వం,గిరిజన శాఖమంత్రి పట్టించుకోకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇకనైనా ఐటీడీఏ పీఓ, గిరిజనసంక్షేమశాఖ డైరెక్టర్‌, కార్యదర్శి, గిరిజనసంక్షేమశాఖామంత్రి స్పందించాలని డిమాండ్‌ చేశారు.

కార్యక్రమంలో పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement