గరుగుబిల్లి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఎగువన ఉన్న ఒడిశా రాష్ట్రంలో, జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టులో వరద నీటి ప్రవాహం ప్రస్తుతం నిలకడగానే కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం బ్యారేజీవద్ద నీటిమట్టం 105 మీటర్లకు గాను 103.73 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్టు మొత్తం నీటి సామర్థ్యం 2.534 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.760 టీఎంసీల నీటి నిల్వ ఉంది. పై భాగం నుంచి బ్యారేజీకి సగటున 2,681 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, ఈమేరకు మూడు గేట్లు ఎత్తి సగటున 5,259 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. కుడి ప్రధాన కాలువద్వారా నీటి సరఫరాను పూర్తిగా నిలుపుదల చేయగా, పాత కుడికాలువద్వారా 50 క్యూసెక్కులు, పాత ఎడమ కాలువద్వారా 150క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టువద్ద నీటిపరిస్థితిని ఇంజినీరింగ్ అధికారులు బి.కిషోర్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు.


