అప్రమత్తమైన యంత్రాంగం | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తమైన యంత్రాంగం

Sep 24 2026 2:00 AM | Updated on Sep 24 2026 2:00 AM

అప్రమత్తమైన యంత్రాంగం

తుఫాన్‌ నేపథ్యంలో విపత్తును

ఎదుర్కొనేందుకు ప్రజలకు సూచనలు

పార్వతీపురం రూరల్‌ : జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, పొంచి ఉన్న తుఫాన్‌ ముప్పు నేపథ్యంలో ప్రజలు, రైతులు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని యంత్రాంగం స్పష్టం చేసింది. విపత్తును దీటుగా ఎదుర్కొని ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఆయా శాఖల అధికారులు పలు కీలక సూచనలు జారీ చేశారు.

చేతికొచ్చిన పంటల రక్షణ..

వరి, పత్తి పొలాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా వెంటనే కాలువల ద్వారా బయటకు మళ్లించాలని, కోసిన పంటలను టార్పాలిన్లతో కప్పి భద్రపరచాలని వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు భవానీ శంకర్‌, సత్యనారాయణ రెడ్డి తెలిపారు. వర్షాలు తగ్గే వరకు పురుగు మందుల పిచికారీ ఆపాలని, ఈదురుగాలులకు అరటి, బొప్పాయి తోటలు నేలకూలకండా కర్రల ఆసరా ఇవ్వాలని అధికారులు తెలిపారు.

విద్యుత్‌ ప్రమాదాలతో జాగ్రత్త..

రోడ్లు, పొలాల్లో తెగిపడిన విద్యుత్‌ తీగలను, నేలకూలిన స్తంభాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దని ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ పి. త్రినాథ రావు తెలిపారు. తడి చేతులతో స్విచ్‌లు తాకరాదని, ఉరుముల సమయంలో ఎలక్ట్రానిక్‌ పరికరాల ప్లగ్‌లు తీసివేయాలని, ప్రమాదాలు గమనిస్తే 1912 టోల్‌ ఫ్రీ నంబర్‌కు లేదా స్థానిక కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందించాలని కోరారు.

వ్యాధులు దరిచేరకుండా పారిశుధ్యం..

వర్షాల వేళ జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉన్నందున ప్రజలు విధిగా కాచి చల్లార్చిన నీటినే తాగాలని డీఎంహెచ్‌వో డా.విజయలక్ష్మి సూచించారు. జ్వరం, వాంతులు ఉంటే సొంత వైద్యం చేసుకోకుండా నేరుగా పీహెచ్‌సీకి వెళ్లాలని హితవు పలికారు. అలాగే, ఇళ్ల పరిసరాల్లో, పాత టైర్లలో వర్షపు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, కాలువల్లో బ్లీచింగ్‌, ఆయిల్‌ బాల్స్‌ చల్లాలని జిల్లా పంచాయతీ అధికారి రవీంద్ర సూచించారు.

జలాశయాలు, వాగుల వద్దకు వెళ్లొద్దు..

చెరువులు, రిజర్వాయర్లు వేగంగా నిండుతున్నందున ప్రజలెవరూ గట్ల పైకి వెళ్లరాదని, ఉధృతంగా ప్రవహించే కాజ్‌వేలను కాలినడకన దాటడం అత్యంత ప్రమాదకరమని నీటిపారుదల శాఖ ఎస్‌ఈ ప్రదీప్‌ తెలిపారు. వరద ముప్పు ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు.

పశువులకు బూజుపట్టిన గడ్డి మేపొద్దు..

మూగజీవాలను చెట్ల కింద, వాగుల సమీపంలో, విద్యుత్‌ స్తంభాల వద్ద కట్టేయకుండా ఎత్తైన ప్రాంతాలకు తరలించాలని పశుసంవర్ధక శాఖ అధికారి తెలిపారు. ముందుగానే మూడు నాలుగు రోజులకు సరిపడా పశుగ్రాసాన్ని నిల్వ చేసుకోవాలని, పశువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ తడిసిన లేదా బూజు పట్టిన గడ్డిని మేపరాదని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement