● 5వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
● అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న ఆర్డీవో సుధారాణి
వంగర:
మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు వద్ద నీటిమట్టం పెరుగుతోంది. అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి 5వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు వద్ద 63.60 మీటర్ల లెవెల్ నీటిమట్టం బుధవారం నమోదైంది. ప్రాజెక్టు వద్ద డీఈ పి.అర్జునరావు, ఏఈ నితిన్‌లు నీటి హెచ్చుతగ్గులను పర్యవేక్షిస్తున్నారు. నదీతీర గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేసినట్లు అధికారులు వెల్లడించారు. కొప్పర, కొండచాకరాపల్లి, గీతనాపల్లి గ్రామాల్లో ఇప్పటికే దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి..
అధికారులు అప్రమత్తంగా ఉండాలని చీపురుపల్లి ఆర్డీవో సుధారాణి తెలిపారు. ఈఈ గోవిందరావుతో కలిసి మడ్డువలస ప్రాజెక్టును బుధవారం ఆమె సందర్శించారు. నదుల నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో, ప్రాజెక్టులో నీటినిల్వ, పూర్తి స్థాయి సామర్ధ్యం తదితర అంశాలపై ఆర్డీవో ఆరా తీశారు. ప్రాజెక్టు తీర గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. వరద ఉధృతి పెరిగితే దిగువ గ్రామాలను అప్రమత్తం చేసి గేట్లు ఎత్తివేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ పిన్నింటి రామారావు, డీఈ పి.అర్జున్, ఏఈ నితిన్‌తోపాటు ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.


