మరోవైపు కార్యక్రమం వాయిదా పడడానికి కూడా ఒక కారణం ఉందన్న చర్చ నడుస్తోంది. ఓ ఎమ్మెల్యేకు కనీస ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం.. తనకు తెలియకుండానే ఏర్పాట్లు చేసుకోవడం వల్ల సదరు ఎమ్మెల్యే అసంతృప్తికి లోనైనట్లు తెలిసింది. పైగా, ఆహ్వాన పత్రికలో సైతం తన పేరుకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై అలిగారని సమాచారం. ఈ నేపథ్యంలోనే కార్యక్రమం చేపడితే ఎటువంటి పరిణామాలు ఎదురుకానున్నాయో.. అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేశ్ ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం విదితమే. ఎండల వల్ల విద్యార్థులకు ఏమైనా జరిగితే.. సంబంధిత శాఖ మంత్రిగా నారా లోకేశ్ బాధ్యత పడాల్సి వస్తుందని హెచ్చరించినట్లు సమాచారం. పైనుంచి వచ్చిన ఆదేశాలతోనే కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
సాక్షి, పార్వతీపురం మన్యం:
కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని తలపెట్టిన భారీ మెగా కోలాటం ప్రదర్శన వాయిదా పడింది. జిల్లా కేంద్రంలో వేల మంది విద్యార్థులతో బుధవారం నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాన్ని ఎండల తీవ్రత కారణంగా వాయిదా వేస్తున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
ఎండలతో నలువైపుల నుంచి విమర్శలు
దాదాపు 6 వేల మంది విద్యార్థులతో 18 నిమిషాల పాటు 22వ తేదీ ఉదయం 7 గంటల నుంచి కోలాట ప్రదర్శన చేపట్టాలని కలెక్టర్ ప్రభాకర రెడ్డి నిర్ణయించారు. ఉదయం 10 గంటల వరకూ కార్యక్రమం ఉంటుందని ఆహ్వాన పత్రికలు కూడా ముద్రించారు. జిల్లా ప్రజా ప్రతినిధులకు, ముఖ్యులకు కూడా వీటిని పంపించారు. కార్యక్రమ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేశారు. ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు కొద్దిరోజులుగా జిల్లా కేంద్రంలోనే ఉండి.. రహదారిపై ప్రదర్శనకు వీలుగా మార్కింగ్ ఇతర ఏర్పాట్లు చూసుకుంటున్నారు. జిల్లా అధికారులకు సైతం కొన్ని బాధ్యతలు అప్పగించారు. ఈ ప్రదర్శన కోసం విద్యార్థులు ఇప్పటికే శిక్షణ పొందారు. ప్రత్యేక డ్రెస్ కోడ్‌తో సిద్ధమయ్యారు. మంగళవారం ఉదయం వరకు కార్యక్రమం ఉంటుందనే అంతా భావించారు. ఉదయం కలెక్టరేట్లో మంత్రి సంధ్యారాణి ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష తర్వాత.. వాయిదా నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి కొద్దిరోజులుగా జిల్లాలో ఎండల తీవ్రత అధికంగా ఉంటోంది. 40 డిగ్రీలకుపైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఎండ తీవ్రత కనిపిస్తోంది. ఇటువంటి సమయంలో కోలాట ప్రదర్శన కోసమని.. గంటల కొద్దీ విద్యార్థులను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదన్న వాదన అధికార వర్గాల నుంచి కూడా వ్యక్తమైంది. ఎండల వల్ల పిల్లలు డీ – హైడ్రేషన్‌కు లోనై పడిపోతే, కార్యక్రమం ఉద్దేశం పక్కకువెళ్లిపోతుందని ఆందోళన సైతం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టిలో పెట్టేందుకు ఎవరూ సాహసం చేయలేకపోయారు.
జిల్లాలో కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో, ప్రదర్శనలో పాల్గొనే సుమారు 6 వేల మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వాయిదా నిర్ణయం తీసుకున్నాం. పిల్లల క్షేమమే ముఖ్యం.ఇటీవల నిర్వహించిన ‘డ్రగ్స్ వద్దు బ్రో’ కార్యక్రమంలో కూడా ఎండవల్ల కొందరు విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. వాయిదా పడిన ఈ కార్యక్రమాన్ని ఉష్ణోగ్రతలు తగ్గిన తర్వాత తిరిగి నిర్వహించే తేదీ త్వరలోనే ప్రకటిస్తాం.
– గుమ్మిడి సంధ్యారాణి, రాష్ట్ర మంత్రి


