ప్రజల ప్రాణాలతో చెలగాటమా..?
అన్ని రంగాల్లో ప్రభుత్వం వైఫల్యం
విజయనగరం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. ప్రాణాధారమైన నీళ్లు కలుషితమవుతున్నాయని, ఆరోగ్యాన్నిచ్చే పాలు కల్తీ కావడంతో చిన్నారులు ప్రాణాలు కోల్పోయే దుస్థితి నెలకొందని తూర్పారబట్టారు. రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజారోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని విమర్శించారు. ధర్మపురిలోని సిరి సహస్ర రైజింగ్ ప్యాలెస్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పరిస్థితిని సమీక్షించి, సురక్షిత నీటి సరఫరా, ఆహార భద్రత పర్యవేక్షణ వ్యవస్థలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. పరిశుభ్రత ప్రమాణాలను కఠినంగా అమలు చేసి, మరిన్ని ప్రాణనష్టాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం నుంచి అద్భుతాలు ఆశించడం లేదని, కనీసం ప్రాణ రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మాత్రమే ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.
● ఎవరైనా బతకడానికి పాలు, నీళ్లు తాగుతారని, కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఆ రెండూ ప్రాణాంతకంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కు మంటుంటే ప్రజాప్రతినిధులు ఆట విడుపు కార్యక్రమాల్లో ఆనందిస్తున్నారని, అధికార యంత్రాంగం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో తలెత్తిన సమస్యను పరిష్కరించాల్సింది పోయి... ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదంటూ సమర్ధించుకునే ప్రయత్నం చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే....
శ్రీకాకుళంలో కలుషిత నీటి కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయి, దాదాపు 200 మంది ఆస్పత్రుల పాలయ్యారని తెలిపారు. రాజమహేంద్రవరం నగరంలో కల్తీ పాలు తాగి ఏడుగురు మరణించగా, మరికొందరు వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ప్రాణాలు నిలపాల్సిన నీరు, పోషణ ఇవ్వాల్సిన పాలు మరణానికి కారణమవడం ప్రభుత్వ నిర్లక్ష్యపాలనకు నిదర్శనమన్నారు.
● కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విజయనగరం జిల్లా గుర్ల మండలం డయేరియా ప్రబలి 11 మంది ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వంలో చలనంలేకపోవడం ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపిస్తుందన్నారు. అప్పట్లో గుర్లలో పర్యటించిన డీప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఈవిషయంపై దృష్టి సారించకపోవడం అటువంటి పరిస్థితులే మరల పునరావృతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో బాధ్యత గల ప్రతిపక్షంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మరణించిన కుటుంబాలకు ఆర్థిక ఆసరా కల్పించి అండగా నిలిచామని గుర్తు చేశారు.
ఉత్తరాంధ్ర అంటే ఎందుకంత వివక్ష
కూటమి ప్రభుత్వ అధినేత చంద్రబాబుకు గిరిజనలున్నా... ఉత్తరాంధ్ర ప్రాంతమన్నా నిర్లక్ష్యం తగదని మజ్జి శ్రీనివాసరావు అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలో గల కురుపాం గిరిజన ఆశ్రమపాఠశాలలో ఇటీవల 16 మంది విద్యార్థినులు డయేరియాతో అస్వస్థతకు గురై, వారిలో ఐదుగురిని ఆస్పత్రికి తరలించిన విషయాన్ని ప్రస్తావించారు. గతంలో కూడా ఇదే పాఠశాలలో కలుషిత నీటి కారణంగా ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, దాదాపు 100 మంది విద్యార్థినులు ఆస్పత్రి పాలయ్యారని గుర్తుచేశారు. ఇంతటి దారుణ ఘటనల అనంతరం కూడా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఇదే విషయమైన ఎస్సీ, ఎస్టీ కమిషన్‌తో పాటు హ్యూమన్‌రైట్స్ ప్రతినిధులకు వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారన్నారు. సాక్ష్యాత్తు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సొంత జిల్లాలో ఇటువంటి పరిస్థితులు నెలకొన్నా పట్టించుకునే వారు కరువయ్యారన్నారు. కలుషిత నీటి ఘటన తరువాత వసతి గృహాల్లో ఆర్వో ప్లాంట్‌లు ఏర్పాటు చేస్తామని, విద్యార్థులకు వసతి సౌకర్యాలు మెరుగుపరుస్తామంటూ జారీ చేసిన జీవో నీటిపై రాతల్లా మిగిలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనలకు బాధ్యులు ఎవరు చంద్రబాబు..?
టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడిచిన 22 నెలల్లో రాాష్ట్రవ్యాప్తంగా హాస్టళ్లు, విద్యాసంస్థల్లో ఫుడ్ పాయిజన్, కలుషిత నీరు, అపరిశుభ్రత కారణంగా దాదాపు 25 ఘటనలు చోటుచేసుకున్నాయని జెడ్పీచైర్మన్ పేర్కొన్నారు. 15 జిల్లాల్లో 900 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, ఈ అంశాన్ని జాతీయ మీడియా కూడా ప్రధానంగా ప్రస్తావించిందన్నారు. విజయనగరంతో పాటు చేబ్రోలు, విజయవాడ, గుంటూరు, గుర్ల, శ్రీకాకుళం, తురకపాలెం ప్రాంతాల్లో డయేరియా ప్రబలిందని, వందలాది మంది అస్వస్థతకు గురై, డజన్ల కొద్దీ మరణాలు సంభవించాయని తెలిపారు. ముఖ్యంగా కలుషిత నీరు, అపరిశుభ్రతే ప్రధాన కారణాలని పేర్కొన్నారు. ఈ ఘటనలకు బాధ్యులెవరని ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వంలో ప్రజల ప్రాణాలకు భరోసా కరువు
కల్తీ పాలు, కలుషిత నీళ్లు తాగి ప్రాణాలు కోల్పోతున్నా వీడని నిర్లక్ష్యం
గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల జీవితాలతో ఆటలు
డయేరియా ప్రభలుతున్నా కానరాని నివారణ చర్యలు
స్పందించని ప్రజాప్రతినిధులు.. కనిపించని అధికార యంత్రాంగం
ప్రజల ప్రాణాలు కాపాడండి: జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
చంద్రబాబు ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. ప్రధానంగా విద్య, వైద్య రంగాలను నిర్వీర్యం చేస్తోందని దుయ్యబట్టారు. విద్యార్ధులకు అవసరమైన సదుపాయాలు కల్పించకపోగా.... మధ్యహ్న భోజనపథకాన్ని భ్రష్టుపట్టిస్తోందన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రాథమిక సదుపాయాలు కల్పించకపోవడంతో పేదలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి చేతి చమురువదిలించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఒక్క యూరియా బస్తా ఇవ్వలేని ప్రభుత్వం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఘోరంగా విఫలమైందని చెప్పారు. మొక్కజొన్నలు క్వింటా రూ.2400 మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో సిండికేట్‌గా ఏర్పడిన దళారులు రూ.1500కే రైతుల నుంచి పంటను దోచుకుంటున్నారని వాపోయారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు కె.వి. సూర్యనారాయణరాజు, నెక్కల నాయుడుబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి వర్రి నర్సింహమూర్తి, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.


