గరం గరం..!
ప్రొటోకాల్ అధికారులు మరిచారా.. ఎమ్మెల్యే వద్దన్నారా?
‘పురం’లో...
సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం నియోజకవర్గంలో పేరుకే ‘కూటమి’ అధికారం గానీ.. ఇక్కడ అంతా టీడీపీదే హవా. కూటమి ఎమ్మెల్యేగా గెలుపొందిన టీడీపీకి చెందిన బోనెల విజయ్‌చంద్ర వ్యవహారశైలి సమస్యాత్మకంగా మారుతోంది. ఏకపక్ష విధానాలతో వేగలేక, ప్రతిసారీ పెద్దల వద్ద పంచాయితీలు పెట్టుకోలేక.. సొంత పార్టీలోని సీనియర్లే సైలెంట్ అయిపోయారు. ఉమ్మడి విజయనగరం టీడీపీకి అధ్యక్షునిగా, ఎమ్మెల్సీగా పని చేసిన సీనియర్ నేత ద్వారపురెడ్డి జగదీశ్ పత్తా లేకుండా పోయారు. బలమైన కొప్పల వెలమ సామాజిక వర్గానికి చెందిన ఆయన.. పార్టీలో ఏదో ఉన్నారంటే ఉన్నారంతే! ఇంక అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు సైతం రాజకీయ వైరాగ్యంలో ఉన్నారు. వీరిని పొమ్మన లేకుండా పొగ బెట్టేశారన్న ప్రచారం నియోజకవర్గంలో జోరుగా ఉంది.
చీలిపోతున్న ‘కూటమి’
కూటమి భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య మొదటి నుంచి సఖ్యత కనిపించడం లేదు. జనసేన ఇన్‌చార్జి ఆదాడ మోహనరావు ఏనాడో నియోజకవర్గ ఎమ్మెల్యే వైఖరిని తప్పుపట్టారు. బహిరంగంగానే విమర్శలు చేశారు. ఎమ్మెల్యే ఏకపక్ష వైఖరి, అవినీతిపై ఆరోపణలు చేశారు. అధినేత పవన్ కల్యాణ్ దృష్టికీ తీసుకెళ్లారు. ఆయనకు ఎక్కడా న్యాయం జరగకపోవడంతో నియోజకవర్గానికి చుట్టం చూపులా వచ్చి వెళ్తున్నారు. ఇంక జనసేన కార్యకర్తలు సైతం.. ఎన్నికలకు ముందు ఉన్నంత దూకుడు చూపించడం లేదు. ‘తమ్ముళ్ల’ వేగాన్ని తట్టుకోలేక, ఏ పనులూ చేయించుకోలేక.. తమ సొంత పనుల్లో నిమగ్నమైపోయారు.
● ఇప్పటి వరకూ బీజేపీ నాయకులు బయట పడలేదు గానీ.. ఇప్పుడిప్పుడే తమ ఆగ్రహాన్ని, ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజుల కిందట బీజేపీకి చెందిన సురగాల ఉమామహేశ్వరరావు బహిరంగంగానే ఎమ్మెల్యేపై ధ్వజమెత్తారు. ఇప్పుడు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు సైతం తమకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తారు. నేరుగా చెప్పుకోలేక.. అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని నెపాన్ని వారిపై నెట్టేశారు. అధికారుల తీరుతో కూటమిలో చిచ్చు రేగుతోందని.. జనసేన, బీజేపీ కార్యకర్తల మనోభావాలు గాయపడుతున్నాయని వాపోయారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో కూటమి నేతలను భాగస్వామ్యం చేయడం లేదని, ఎమ్మెల్యే విజయ్‌చంద్రకు చెప్పినా న్యాయం జరగడం లేదని ఆయన వాపోవడం గమనార్హం. స్థానిక ఎన్నికల వేళ అంజెడా మార్చే ప్రయత్నం చేస్తున్నారని.. అధికారులను హెచ్చరించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని శనివారం మీడియా సమావేశంలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నిధులు కేంద్రానివి.. ప్రధాని ఫొటో ఏదీ?
సీజీఎస్‌టీ భవన సాక్షిగా ప్రొటోకాల్‌కు పాతర వేశారని.. కూటమిలో ఉన్న బేజేపీ, జనసేలను విస్మరించడం ధర్మమా? అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని ఫొటో లేకుండానే కేంద్ర నిధులతో స్వచ్ఛభారత్ అభియాన్ కింద పనులు చేపించుకుంటున్నారని విమర్శించారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ప్రొటోకాల్ విషయంలో యంత్రాంగం స్పందించడం లేదని చెబుతున్న ఆయన.. జిల్లా మంత్రి, ఇన్‌చార్జి మంత్రి జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. మొత్తంగా బీజేపీ, జనసేన నాయకుల విమర్శలు నేరుగా ఎమ్మెల్యేపైనే ఉంటున్నాయి. ఆయన ఒక్కరే కూటమిలో ఉంటే సరిపోతుందా? అని లోలోపల రగిలిపోతున్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అందుకు కారణమూ లేకపోలేదు. పార్వతీపురంలో శనివారం జీఎస్టీ నిధులతో పింక్ టాయిలెట్ నిర్మాణానికి ఏపీ జీఎస్టీ కమిషనర్ పి.ఆనంద్‌కుమార్, ఎమ్మెల్యే బోనెల విజయ్‌చంద్ర శంకుస్థాపన చేశారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షురాలు తేజోవతి, స్థానిక టీడీపీ నాయకులు ఇందులో పాల్గొన్నారు. స్వచ్ఛభారత్ నిధులతో చేపట్టిన ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడి హోదాలోనైనా.. ఏపీ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గానైనా తనను ఆహ్వానించలేదని ద్వారపురెడ్డి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం పార్టీ కూడా ఒక భాగస్వామి అని.. ప్రాజెక్టుల మంజూరులో ప్రాధాన్యం ఇవ్వాలని జీఎస్టీ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. అదే ఎన్డీయే కూటమిలో ఉన్న.. బీజేపీ జిల్లా అధ్యక్షునికి ఎందుకు ఆహ్వానించలేదని శ్రీనివాసరావు అనుచరులు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర నిధులతో చేపడుతున్నప్పటికీ.. కనీసం ఎక్కడా ప్రధాని ఫొటో వేయకపోవడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎమ్మెల్యే వద్దన్నారో.. మున్సిపల్ అధికారులు విస్మరించారో గానీ... పింక్ టాయిలెట్స్ నిర్మాణానికి ఏర్పాటు చేసిన శిలాఫలకంలో పట్టణ ప్రథమ పౌరురాలు, మున్సిపల్ చైర్‌పర్సన్ గౌరీశ్వరి పేరు లేకపోవడం గమనార్హం. ఆమెను కనీసం ఈ కార్యక్రమానికీ పిలవక, శిలాఫలకంపై పేరు వేయక అవమానించారని పలువురు వైఎస్సార్‌సీపీ కౌన్సిల్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


