దిక్కూమొక ్క లేక..!
పాలకొండ రూరల్: క్షేత్రస్థాయిలో పచ్చదనం పెంపొందించడంతో పాటు ఆహ్లాదాన్ని విస్తరింపజేయడం, తద్వారా ఉపాధి వేతనదారులకు పనులు కల్పించేందుకు చేపడుతున్న చర్యలు.. క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం కారణంగా సత్ఫలితాలు ఇవ్వడం లేదు. పర్యావరణ పరిరక్షణకు ఏటా రూ.లక్షల ప్రజాధనం ఖర్చు చేస్తున్నా.. వాటి ఫలాలు ప్రజలకు అందడం లేదు. ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామ రహదారులకు ఇరువైపులా, చెరువు గట్లపై వేలాది మొక్కలు నాటుతున్నారు. సరైన రక్షణ కల్పించకపోవడం, పర్యవేక్షణ చేపట్టకపోవడంతో వేసిన మొక్కల జాడ రోజుల వ్యవధిలో కానరావడం లేదు.
ఉపాధి పనుల్లో భాగంగా..
ఉపాధి హామీ పనుల్లో భాగంగా జిల్లాలోని 15 మండలాల్లో 360కుపైగా పంచాయతీల్లో 788 పనులు చేపట్టారు. ఈ క్రమంలో ప్రస్తుత ఏడాదిలో 49,936 మొక్కలను నిర్దేశిత లెక్కల మేరకు నాటారు. ఒక్కో మొక్కకు రూ.54లు వెచ్చించారు. ఈ మొత్తం రమారమి రూ.76.90 లక్షలుగా రికార్డులు చెబుతున్నాయి. బ్లాక్ ప్లాంటేషన్‌లో భాగంగా నాటిన ఈ మొక్కల్లో చాలా వరకు క్షేత్రస్థాయిలో కనుమరుగయ్యాయి. గతంలో ఉపాధిహామీ వేతనదారులే మొక్కల సంరక్షణ బాధ్యత చూసే వారు.. ప్రస్తుతం వీటి పరిరక్షణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించారు. వీరు పట్టించుకోకపోవడంతో మొక్కల సంరక్షణ కరువైందన్న వాదన వినిపిస్తోంది. క్షేత్రస్థాయి సిబ్బంది పర్యవేక్షణ లేక మొక్కలకు సకాలంలో నీరందక చనిపోయాయి.
గతంలో కంచెలు..
గతంలో ప్రభుత్వం వేసిన మొక్కల రక్షణను దృష్టిలో పెట్టుకుని రూ.70 నుంచి రూ.100 వరకు ఖర్చు చేసి రక్షణ కంచెలను ఏర్పాటు చేసేది. ఉపాధిహామీ వేతనదారులు ఏర్పాటుచేసే రక్షణ కంచెలకు మస్టర్ల రూపంలో నిధులు కేటాయింపులు చేసేవారు. తాజాగా రక్షణ చర్యలు నిలిపివేశారు. దీంతో రక్షణ కొరవడి మొక్కలు మూగజీవాలకు ఆహారంగా మారుతున్నాయి. కాలువ, చెరువు గట్లు, సామాజిక స్థలాల్లో కొబ్బరి మొక్కలు వేశారు. వీటిని నర్సరీల నుంచి యంత్రాంగం తీసుకొచ్చింది. పాలకొండ మండలానికి సంబంధించి నర్సరీ నుంచి కొబ్బరి మొక్కలు కొనుగోలు చేశారు. ఒక్కోమొక్కకు రూ.60, రవాణాకు రూ.5 నుంచి రూ.9 వరకూ ఖర్చు చేశారు. మొక్కనాటే గుంత తీసేందుకు రూ.60, నాటేందుకు రూ.14 చెల్లించారు. ఒక్కో మొక్క పర్యవేక్షణకు నెలకు రూ.15 చెల్లిస్తున్నారు. వేసవి సీజన్‌లో మొక్కలకు సమృద్ధిగా ఓసారి నీరు అందించేందుకు రూ.4.25 కేటాయించారు. ఈ విధంగా 24 తడులు అందించాల్సి ఉంది. ఇది ఎక్కడా కానరావడం లేదు. దీంతో లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి. ఇప్పటికై నా అఽధికారులు అవసరమైన చర్యలపై దృష్టి పెట్టాల్సింది.
జిల్లాలో బ్లాక్ ప్లాంటేషన్‌లో భాగంగా నాటిన మొక్కలకు సంబంధించిన బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించడం జరిగింది. మొక్కలు చనిపోయిన వాటి స్థానంలో కొత్తవి నాటాలి. క్షేత్రస్థాయిలో ఉపాధి సిబ్బంది రక్షణ చర్యలపై దృష్టి పెట్టాలి. ప్రస్తుత వేసవిలో మొక్కల సంరక్షణకు ప్రత్యేక పర్యవేక్షణ చేపడతాం. అవసరమైతే నిధులు అందించేలా చూస్తాం.
– కె.రామచంద్రరావు, డ్వామా పీడీ,
పార్వతీపురం మన్యం
జిల్లాలో ఉపాధిహామీ నిధులతో 50 వేల పైచిలుకు మొక్కల పెంపకం
ఉపాధి హామీ నిధులు రూ.76 లక్షల మేర వెచ్చింపు
పర్యవేక్షణలో మీనమేషాలు.. క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం
సగం మొక్కలు నీరందక చనిపోయిన దుస్థితి..
దిక్కూమొక ్క లేక..!
దిక్కూమొక ్క లేక..!


