ఫైలేరియా రహిత జిల్లాయే లక్ష్యం : కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

ఫైలేరియా రహిత జిల్లాయే లక్ష్యం : కలెక్టర్‌

Mar 1 2026 7:37 AM | Updated on Mar 1 2026 7:37 AM

ఫైలేరియా రహిత జిల్లాయే లక్ష్యం : కలెక్టర్‌

ఫైలేరియా రహిత జిల్లాయే లక్ష్యం : కలెక్టర్‌

బలిజిపేట: జిల్లాలో ఫైలేరియా వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి ఆదేశించారు. పెదపెంకి గ్రామాన్ని ఆయన శనివారం సందర్శించారు. ఫైలేరియా బాధితురాలు బోనుమద్ది ఈశ్వరమ్మ ఇంటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వ్యాధి తీవ్రత, ప్రస్తుతం ఆమెకు అందుతున్న వైద్యసేవలు, మందుల సరఫరా తీరుపై ఆరా తీశారు. మందులను క్రమం తప్పకుండా వాడుతున్నది లేనిది వారిని అడిగి తెలుసుకున్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు పలు సూచనలు అందిస్తూ జిల్లాలోని ఫైలేరియా బాధితులందరికి ఎటువంటి అంతరాయం లేకుండా అవసరమైన మందులను నిరంతరం సరఫరా చేయాలన్నారు. దోమల నివారణకు గ్రామాల్లో పారిశుధ్య పనులపై దృష్టి సారించాలన్నారు. ఫైలేరియా వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. జిల్లాను ఫైలేరియా రహితంగా తీర్చిదిద్దేందుకు క్షేత్ర స్థాయి సిబ్బంది అంకితభావంతో పని చేయాలని సూచించారు.

సమీక్షలో ఆగ్రహించిన కలెక్టర్‌

వివిధ శాఖలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో గ్రామంలో వ్యాధి ప్రబలడం, పారిశుధ్యంపై ఆగ్రహించారు. పరిసరాల పరిశుభ్రత ఇదేనా అంటూ కార్యదర్శిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహించారు. మహిళా సంఘాలు కొత్త తరహాలో వ్యాపారాలను ఏర్పాటు చేసుకుని అభివృద్ధి చెందాలన్నారు. ఉపాధి పనుల నిర్వహణ, ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై అధికారులపై ఆగ్రహించారు.

పింఛన్ల పంపిణీ

గ్రామంలో పలువురు వృద్ధుల ఇంటి వద్దకు వెళ్లి కలెక్టర్‌ ప్రభాకరరెడ్డి పింఛన్లు పంపిణీ చేశారు. లబ్థిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నేరుగా వారికి పింఛన్లు అందించాలన్నారు. నడవలేని స్థితిలో ఉండే వారు, దివ్యాంగుల ఇంటికి ఉదయమే వెళ్లి ముందుగా వారికి అందించాలని సూచించారు. సచివాలయ సిబ్బంది సేవా దృక్పథంతో పని చేయాలన్నారు. గ్రామంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ ఆర్‌.వైశాలి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి భాస్కరరావు, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి విజయ్‌మోహన్‌, ఇన్‌చార్జ్‌ డీఎంఓ రామచంద్రరావు, డ్వామా పీడీ సుధారాణి, మండల స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement