నమ్మాం.. మోసపోయాం..
మధ్యలో నిలిచిపోయిన ఎన్టీఆర్ గృహ నిర్మాణ
పథకం కింద మంజూరైన ఇల్లు
రామభద్రపురం: సొంత గూడు ఉండాలనేది సగటు మనిషి కల. పేద, మధ్యతరగతి వ్యక్తులు ఎన్నో కష్టాలకోర్చి మరీ ఇంటి నిర్మాణానికి ముందుకు వస్తుంటారు. ఇటువంటి వారికి ప్రభుత్వ ప్రోత్సాహం అందితే వారి కల త్వరగా నేరవేరుతుంది. అయితే చంద్రబాబు సర్కారు నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేకపోవడంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. తాజాగా అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయినా గృహ నిర్మాణాలపై ఎటువంటి ప్రకటన చేయకపోవడం విశేషం. ఇదిలా ఉంటే 2014 – 19లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం కింద మంజూరైన ఇళ్లకు కూడా బిల్లులు చెల్లించలేదు. దీంతో ఆయా లబ్ధిదారులు నిర్మాణాలను మధ్యలో వదిలేశారు. తాజాగా 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటిలో నిలిచిపోయిన నిర్మాణాలకు కూడా బిల్లులు చెల్లిస్తామని కూటమి నాయకులు హామీలిచ్చారు. ఇందుకోసం 2024 సెప్టెంబర్‌లో గృహనిర్మాణ శాఖాధికారులు, సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు గ్రామాల్లో సర్వే కూడా చేపట్టారు. ఎన్ని ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయి.. బిల్లులు ఎంత చెల్లించాలో ఆరా తీశారు. జిల్లా వ్యాప్తంగా 24,094 మంది లబ్ధిదారులను గుర్తించి, వీరికి రూ. 18.84 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉందని నిర్ధారించారు. ఇళ్లన్నీ వివిధ దశలలో ఉండిపోవడంతో, బిల్లులు మంజూరైతే పూర్తి చేసుకుంటామని లబ్ధిదారులు ఆశగా ఎదురుచూశారు. అయితే ఎంతకీ బిల్లులు మంజూరు చేయకపోవడంతో చంద్రబాబును నమ్మి మోసపోయామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పీఎంఏవై 2.0 కింద 39,559 మంది గుర్తింపు
ఇదిలా ఉంటే గత ఎన్టీఆర్ గృహ నిర్మాణ లబ్ధిదారులకే బిల్లులు చెల్లించలేని చంద్రబాబు ప్రభుత్వం.. మళ్లీ ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన 2.0 కింద 39,559 మంది లబ్ధిదారులను ఎంపిక చేసింది. దీంతో చాలా మంది నిర్మాణాలు చేపడితే బిల్లులు పడతాయనే ఉద్దేశంతో పనులు చేపట్టినా ఒక్క రూపాయి కూడా పడలేదు. పైగా ఒక్కో యూనిట్‌కు ఎంత మంజూరు చేస్తామో కూడా ప్రకటించకపోవడం విశేషం.
ఎదురుచూపులే మిగిలాయి..
2014 – 19 మధ్య కాలంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు మంజూరైంది. అప్పట్లో ఒక్కో యూనిట్‌కు రూ.1.50 లక్షలు ఇస్తామన్నారు. అప్పులు చేసి శ్లాబు వరకు నిర్మాణం చేపట్టాను. నా బ్యాంక్ ఖాతాలో కేవలం రూ. 19 వేలు మాత్రమే పడ్డాయి. మిగిలిన బిల్లులు రావాల్సి ఉంది. బిల్లుల కోసం ఎదురుచూపులే మిగిలాయి.
– పాండ్రంకి లత, లబ్ధిదారు, రామభద్రపురం
విడుదలైన వెంటనే
జమచేస్తాం.
ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన ఇళ్లకు సంబంధించి నిధులు విడుదలైన వెంటనే లబ్ధిదారుల ఖాతాలకు జమచేస్తాం. అలాగే పీఎంఏవై 2.0 కింద కొత్త ఇళ్లు ఉగాది నాటికి మంజూరయ్యే అవకాశం ఉంది. ఒక్కో యూనిట్‌కు ఎంత నిధులు మంజూరు చేస్తారన్నది త్వరలోనే తెలుస్తుంది.
–జి. మురళీఽమోహనరావు,
హౌసింగ్ పీడీ, విజయనగరం
రూపాయి పడింది..
ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం కింద 2014 – 19 మధ్య ఇల్లు మంజూరైంది. నా బ్యాంక్ ఖాతాలో అప్పట్లో రూపాయి పడింది. అప్పులు చేసి నిర్మాణం చేపట్టాం. తాజాగా పాత బిల్లులు చెల్లిస్తామని సర్వే చేపట్టారు. ఎంతో ఆశపడ్డాం. కాని ఇంతవరకు ఎటువంటి పురోగతి లేదు. ప్రభుత్వం త్వరితగతిన బిల్లులు చెల్లించాలి.
– మామిడి అప్పన్న, లబ్ధిదారు, రామభద్రపురం
నమ్మాం.. మోసపోయాం..
నమ్మాం.. మోసపోయాం..


