మున్సిపల్ కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలి
నెల్లిమర్ల: అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్ కార్మికుల సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలపై చర్చించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ ఫెడరేషన్(సీఐటీయూ) డిమాండ్ చేస్తోందని యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు దుర్గారావు అన్నారు. ఇదే విషయమై స్థానిక మొయిద జంక్షన్ వద్ద జరిగిన శనివారం చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో 17 రోజుల పాటు సమ్మె చేయడం జరిగిందని, అప్పుడు జరిగిన రాతపూర్వక ఒప్పందాలకు నేటికీ ప్రభుత్వం జీవోలు జారీచేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. సంవత్సరాలు గడుస్తున్నా మృతి చెందిన, రిటైరైన వారి బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వకుండా పాలకవర్గాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, మట్టి ఖర్చులు, ఎక్స్‌గ్రేసియా పెంపు, 62 ఏళ్ల వరకు కొనసాగింపు తదితర జీవోలను తక్షణమే ఇవ్వాలన్నారు. పర్మినెంట్ ఉద్యోగులు, కార్మికుల సరెండర్ లీవ్ డబ్బులు, డీఏ బకాయిలు చెల్లించాలని, 12వ పీఆర్సీ తక్షణమే ప్రకటించాలని, మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తూ అసెంబ్లీలో నిర్ణయం చేయాలన్నారు.
మున్సిపాలిటీల్లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న థర్డ్ పార్టీ కార్మికులందరికీ ఆప్కాస్ జీతాలు చెల్లించాలని, లేబర్ హాలిడేస్, ఈఎస్‌ఐ, పీఎఫ్ చట్టబద్ధమైన హక్కులను అమలు చేయాలన్నారు. ఈ నెల 23న నగర పంచాయతీ ఆఫీస్ వద్ద, 24న విజయవాడలో ధర్నా చేపడతామన్నారు.


