సచివాలయ ఉద్యోగులకు..
● శంబర పోలమాంబ జాతరలో ఉద్యోగులను అవమానపరిచే ఘటన
పార్కింగ్ ఫీజు వసూలు బాధ్యత
సాక్షి, పార్వతీపురం మన్యం/మక్కువ: సచివాలయ ఉద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం అవమానించింది. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబర పోలమాంబ సిరిమానోత్సవంలో గ్రామ సచివాలయ ఉద్యోగులకు మరుగుదొడ్ల వద్ద, వాహనాల పార్కింగ్ ఫీజు వసూలు, షాపుల ఆసీల వసూలు విధులు అప్పగించడంపై వివాదం నెలకొంది. ఏటా శంబర పోలమాంబ ఉత్సవ సమయంలో ఆలయ కమిటీ.. గ్రామ పంచాయతీ దుకాణాల వద్ద ఆసీలు, పార్కింగ్ ఫీజు, మరుగుదొడ్ల నిర్వహణ ఫీజు వసూలు చేసేది. ఈ ఏడాది ప్రజాప్రతినిధులు, అధికారులు భిన్నంగా వ్యవహరించారు. ఉన్నత విద్యావంతులైన గ్రామ సచివాలయ ఉద్యోగులను కించపరిచేలా పార్కింగుల వద్ద టోకెన్ ఇవ్వడం, దుకాణాల ఆసీల వసూలు బాధ్యతలను అప్పగించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమైంది. ఏపీ ప్రభుత్వ గ్రామ సచివాలయ శాఖ గుర్తింపు కార్డులు వేసుకుని మరీ ఉద్యోగులు అక్కడ విధులు నిర్వర్తిస్తుంటే.. జాతరకు వచ్చిన భక్తులు విస్తుపోయారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వీరందరికీ గౌరవ ప్రదమైన ఉద్యోగాలిస్తే.. చంద్రబాబు ప్రభుత్వం వారి స్థాయిని దిగజార్చేలా అవమానిస్తోందని చర్చించుకోవడం కనిపించింది. మక్కువ మండలంలోని 11 గ్రామ సచివాలయాల నుంచి సుమారు వంద మంది ఉద్యోగులను విధులకు వినియోగించారు. వీరిలో మహిళా పోలీసులు కూడా ఉన్నారు.
సచివాలయ ఉద్యోగులకు..


