పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్‌లు అమ్మవారికి కుంకుమార్చన జరిపించారు. మూడులాంతర్లు వద్దనున్న బాలాలయంలోను, రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడిలో అమ్మవారికి మహిళలు పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ కె.శిరీష పర్యవేక్షించారు.
మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారం సులభం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత
విజయనగరం లీగల్: మధ్యవర్తిత్వంలోని మెలకువలను నేర్చుకోవడం ద్వారా కేసులను చాలా సులభంగా పరిష్కరించవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత అన్నారు. 40 గంటల మీడియేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా మొదటి రోజు శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం కేసుల పరిష్కారానికి ఉపయోగపడుతుందని, వ్యాజ్యాలను మానవతా దృక్పథంతో పరిశీలించి ఉభయ పార్టీల ద్వారానే పరిష్కారం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న ఉమ్మడి జిల్లా న్యాయవాదులను శిక్షణ కార్యక్రమం గురించి అడిగి తెలుసుకున్నారు. శిక్షణను అందిస్తున్న మాస్టర్ ట్రైనీస్‌తో మాట్లాడి కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణ ప్రసాద్, ట్రైనీ మీడియేటర్స్ పాల్గొన్నారు.
రైతన్నకు యూరియా కష్టాలు
వంగర: మండల పరిధి అరసాడ మన గ్రోమోర్ సెంటర్‌లో యూరియా కోసం రైతులు మంగళవారం బారులు తీరారు. ఈ సెంటర్‌కు 12టన్నుల (266 బస్తాలు) యూరియా మంజూరైంది. రెండు రోజుల పాటు అరసాడ, బాగెంపేట, నీలయ్యవలస గ్రామాలతో పాటు రేగిడి మండలంలోని ఉణుకూరు, ఒప్పంగి, కోడిశ, కొండవలస గ్రామాల్లోని రైతులకు ఒక పాస్‌పుస్తకానికి ఒక యూరియా బస్తా చొప్పున మండల వ్యవసాయాధికారులు రెండు రోజులుగా టోకెన్లు జారీ చేశారు. అయితే వచ్చిన యూరియా తక్కువ కావడం, డిమాండ్ ఎక్కువ ఉండడంతో ఆయా గ్రామాల అన్నదాతలు మన గ్రోమోర్ సెంటర్ వద్ద క్యూ కట్టారు. వెయ్యి బస్తాల యూరియా డిమాండ్ ఉన్నప్పటికీ 266 బస్తాలు మంజూరు చేయడం పట్ల రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం యూరియా సమస్య పట్ల నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఏవో తట్టికోట కన్నబాబు వద్ద సాక్షి వివరణ కోరగా అవసరం మేరకు యూరియాను తెప్పించి సరఫరా చేస్తామని వెల్లడించారు.
పుష్పాలంకరణలో పైడితల్లి
పుష్పాలంకరణలో పైడితల్లి


