ప్రజల్లోకి టీడీపీ వైఫల్యాలు
చీపురుపల్లిరూరల్(గరివిడి): ఎన్నికల సమయంలో హామీలిచ్చి..అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న టీడీపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు గరివిడిలో గల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామస్థాయి రాజకీయ పరిణామాలు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు వారి కష్టాలను తెలుసుకోవాలనే ఆలోచనతో గ్రామస్థాయిలో కమిటీలను సమర్థవంతంగా ఏర్పాటు చేయాలనేదే జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన అన్నారు. ఇందులో భాగంగానే ప్రతి నియోజకవర్గం స్థాయిలో సమావేశాలు జరుగుతాయని, ముందుగా చీపురుపల్లి నియోజకవర్గ స్థాయిలో సమావేశం ఏర్పాటు చేశామని, సమర్థవంతంగా గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి అన్ని నియోజకవర్గాలకు ఆదర్శంగా నిలవాలని కోరారు. నియోజకవర్గంలో 27 క్లస్టర్‌లు ఏర్పాటు చేశామని, వీరితో పాటు రెండు గ్రామాలకు ఇద్దరు చొప్పున 69 మంది క్లస్టర్ ఇన్‌చార్జ్‌లు ఉంటారని, వారంతా ముందుండి పార్టీని నడిపిస్తారన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక తోటపల్లి సాగునీరు వస్తోందా? లేదా? అని ప్రశ్నించగా ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా ఉన్నందున నీరు వచ్చిందని, సాధారణంగా తోటపల్లి సాగునీరు వచ్చే పరిస్థితి లేదని నాయకులు ఆయనకు తెలియజేయగా ఇలాంటి సమస్యలపై రైతులతో మాట్లాడాలని సూచించారు. విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్ ఇవ్వకుండా మోసం చేస్తున్నారనే విషయం అందరీకి తెలిసిందేనన్నారు. గ్రామంలోకి వెళ్లినప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ఫీజు రియింబర్స్ మెంట్ ప్రభుత్వం ఇస్తోందా? లేదా అని అడిగి తెలుసుకోవాలి. అదే విధంగా ఉపాధి హామీ పథకం పనులు జరుగుతున్నాయా? ఉపాధి బిల్లులు వస్తున్నాయా? లేదా? ఇలా అన్ని సమస్యలపై స్థానిక ప్రజలతో మాట్లాడాలని సూచించారు. ప్రజల మేలు కోసం వైఎస్సార్‌సీపీ తరఫున ప్రజల సమస్యలను ప్రశ్నిస్తేనే మంచి జరుగుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న మంచి కార్యక్రమాలతో మళ్లీ అధికారంలోకి వస్తామనే నమ్మకం జగన్‌మోహన్‌రెడ్డిలో ఉందని, తప్పనిసరిగా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
గ్రామ స్థాయి కమిటీల నియామకం
సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ దిశానిర్దేశం మేరకు జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాలతోనే క్లస్టర్ ఏర్పాటు, గ్రామస్థాయి కమిటీల నియామకం జరుగుతోందన్నారు. గ్రామస్థాయిలో అన్ని విభాగాల వారీగా కమిటీల నియామకం కావాలన్నారు. మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ పార్టీలో ఉత్సాహంగా ఉన్న వారిని ఎంపిక చేసి ప్రాధాన్యం కల్పిస్తే పార్టీ మరింత పటిష్టంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ యువ నాయకురాలు బొత్స అనూష, వైఎస్సార్‌సీపీ గరివిడి మండల అధ్యక్షుడు మీసాల విశ్వేశ్వరరావు, జెడ్పీటీసీ వాకాడ శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ కొణిశ కృష్ణంనాయుడు, వైఎస్సార్‌సీపీ చీపురుపల్లి మండల అధ్యక్షుడు మీసాల వరహాల నాయుడు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం, జిల్లా ప్రచారవిబాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనువాసులు నాయుడు, యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, మెరకముడిదాం మండల నాయకులు డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎస్‌వీ.రమణరాజు, పార్టీ మండల అధ్యక్షుడు తాడ్డి వేణు, మాజీ జెడ్పీటీసీ కోట్ల విశ్వేశ్వరరావు, గుర్ల మండల నాయకుడు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీ సూర్యనారాయణరాజు, జెడ్పీటీసీ సీర అప్పలనాయుడు, పార్టీ మండల అధ్యక్షుడు పొట్నూరు సన్యాసినాయుడు, నాలుగు మండలాల పీఏసీఎస్ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
సమర్థంగా గ్రామస్థాయి కమిటీల నిర్వహణ
గ్రామస్థాయిలోనే ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలకు ప్రశ్నలు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ
గరివిడిలో వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం


