జీఆర్పీ అదుపులో సెల్‌ఫోన్ల చోరీ నిందితుడు
విజయనగరం క్రైమ్: రైల్వే ప్లాట్‌ఫాంలలో, స్టేషన్లలో, రైళ్లలో సెల్‌ఫోన్ లను దొంగిలించే నిందితుడ్ని విజయనగరం జీఆర్పీ ఎస్సై బాలాజీరావు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎస్సై బాలాజీరావు సోమవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రంలోని కటక్‌కు చెందిన పియ్యాల భిషాల్ ప్రయాణికుల మాదిరిగానే రైల్వే స్టేషన్ లకు వెళ్తూ..ట్రైన్లలో, స్టేషన్‌లో ప్లాట్ ఫాం లవద్ద నిరీక్షిస్తున్న ప్రయాణికుల సెల్ ఫోన్ లను అపహరిస్తూ ఉండేవాడు. ఇటీవల స్టేషన్ లో సెల్‌ఫోన్ పోయిందని ఓ ప్రయాణికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిఘా పెట్టిన జీఆర్పీ సిబ్బంది ఎట్టకేలకు బిషాల్ ను పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.లక్ష విలువ చేసే మూడు 3 మొబైల్ ఫోన్ల ను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రైల్వేకోర్టులో ప్రవేశ పెట్టినట్లు జీఆర్పీ ఎస్సై బాలాజీరావు వివరించారు.
రాజుపేటలో ఏనుగుల సంచారం
● మొక్కజొన్న పంట ధ్వంసం
బొబ్బిలిరూరల్: మండలంలోని దిబ్బగుడ్డివలస పంచాయతీ పరిధి రాజుపేట గ్రామంలో ఏనుగులగుంపు సంచరించి ఆందోళన సృష్టించింది. సీతానగరం మండలం బక్కుపేట నుంచి ఆదివారం రాత్రి రాజుపేట గ్రామానికి చేరుకున్న ఎనిమిది ఏనుగుల గుంపు మొక్కజొన్న పంటలను ధ్వంసం చేయగా, అపరాలు, చెరకు పంటలను నాశనం చేశాయి.రాజుపేట గ్రామానికి చెందిన కర్రి మన్మధరావు, అప్పలనాయుడుల రెండున్నర ఎకరాల మొక్కజొన్న పంటను, కళ్లాల్లో ఉన్న రైతుల ధాన్యం నిల్వలను ధ్వంసం చేశాయి. సోమవారం ఉదయం రాజుపేట నుంచి సీతయ్యపేట గ్రామానికి చేరుకుని గ్రామ శివారులోని కళ్లాల్లో ఏనుగులు తిష్ఠవేశాయి. ప్రస్తుతం అటవీశాఖ సిబ్బంది వాటిని పర్యవేక్షిస్తున్నారు.ఏనుగుల గుంపు వద్దకు ఎవరూ వెళ్లకుండా గ్రామస్తులను హెచ్చరిస్తున్నారు. ఏనుగులు మళ్లీ తిరిగి వెళ్లేవరకు ఆయా గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఏనుగుల గుంపునుంచి ప్రజలకు హాని జరగకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు.
అలరించిన బండ్ల వేషాలు
● ఎనిమిది గ్రామాలకు సంబంధించి బల్లంకి తీర్థం
● అమ్మవారిని దర్శించుకున్న భక్తులు
వేపాడ: మండలంలో ప్రసిద్ధి చెందిన బల్లంకి గ్రామదేవత మరిడిమాంబ అమ్మవారి తీర్థమహోత్సవం సందర్భంగా నిర్వహించిన బండి ప్రభలు పలువురిని ఆకట్టుకున్నాయి. 26,27,28 మూడురోజులపాటు ఈ తీర్థమహోత్సవం నిర్వహించనున్నారు. సోమవారం తీర్థంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం మహిషాసుర మర్దిని తులసీ జలంధర, ప్రమీలార్జునీయం, కురుక్షేత్రం, ద్రౌపది వస్త్రాపమరణ, శ్రీరామపట్టాభిషేకం, హానుమద్రామ సంగ్రామం, గరుడ గర్వభంగం తదితర బండ్ల వేషాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. అలాగే మహిళాకోలాటం, పులివేషాలు, కోయడ్యాన్సులు, డప్పువాయిద్యాలు రెల్లివేషధారణలతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ తీర్థం బల్లంకి, బానాది, ఎం.శింగవరం, భర్తవానిపాలెం, నీలకంఠరాజపురం, పెదగుడిపాల జమ్మాదేవిపేట తదితర గ్రామాలకు సంబంధించి తీర్థం కావడంతో జనసందోహంగా తీర్థం జరిగింది. తీర్థంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వల్లంపూడి ఎస్సై సుదర్శన్ నేతృత్వంలో బందోబస్తు నిర్వహించారు. ఈ నెల 28న ఎడ్ల పరుగు పోటీలు నిర్వహించనున్నట్లు కమిటీసభ్యులు తెలిపారు.
జీఆర్పీ అదుపులో సెల్‌ఫోన్ల చోరీ నిందితుడు
జీఆర్పీ అదుపులో సెల్‌ఫోన్ల చోరీ నిందితుడు


