
ప్రభుత్వ పాలనపై గుర్రుగా జనసైనికులు
పార్వతీపురం రూరల్: ఎన్నికల సమయంలో తామంతా ఒక్కటే. తమ ఎజెండా ఒక్కటే అంటూ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చి తీరా ఏడాదిన్నర గడవక ముందే జనసేన నాయకులు బహిరంగంగా విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి మరీ స్థానిక టీడీపీ ఎమ్మెల్యే, జిల్లాస్థాయి అధికారుల తీరుపై ప్రజల తరఫున జనసేన ప్రశ్నిస్తుందంటూ ఎండగడుతున్నారు. ఈ మేరకు మంగళవారం పార్వతీపురం నియోజకవర్గం జనసేన ఇన్‌చార్జ్ ఆదాడ మోహనరావు ఆ పార్టీ అధినేత జన్మదినాన్ని పురస్కరించుకుని కొన్ని కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ స్థానిక నియోజకవర్గ పాలకుల తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే పార్వతీపురంలో అత్యంత అవినీతి పాలన సాగుతోందని నివేదికలు చెబుతున్నాయన్నారు. ఆరు నెలల క్రితం బడిదేవరకొండ అనుమతులు రద్దుచేయాలని తాము పోరాటం చేస్తే ఆరు నెలల తరువాత స్థానిక ఎమ్మెల్యేకు బడిదేవరకొండ సమస్య గుర్తుకురావడం విడ్డూరంగా ఉందన్నారు. కంపెనీ యాజమాన్యంతో ఇంతవరకు సఖ్యంగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే విజయచంద్రకు ఇప్పుడు స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తుకురావడం మరింత ఆశ్చర్చకరమన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలం
పార్వతీపురంలో చెరువులు అక్రమాలకు గురైతే ఎన్నోమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పత్రికా ముఖంగా నిలదీశారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో పాలకులు, అధికారులు విఫలమయ్యారన్నారు. జిల్లా కేంద్రంలో మున్సిపాల్టీ ప్రజలకు తాగునీటిని సక్రమంగా సరఫరా చేయలేని దుస్థితిలో జిల్లా యంత్రాంగం, పాలకులు ఉన్నారన్నారు. ఏడాదిన్నరలో మంజూరైన నిధులు ఏం చేశారో తెలియడం లేదని ఆశ్చర్యం వెలిబుచ్చారు. ఇకమీదట పార్టీ అధినేత ఆదేశాలకోసం ఎదురుచూడమని, ఇకనుంచి దోపిడీ పాలనపై ప్రశ్నిస్తామని మోహనరావు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పార్వతీపురంలోనే ఎక్కువ అవినీతి
బడిదేవర కొండపై స్థానిక ఎమ్మెల్యే తీరు విడ్డూరం
విలేకరుల సమావేశంలో
ఎండగట్టిన జనసేన ఇన్‌చార్జ్ ఆదాడ