
అర్హత లేని గ్రామీణ వైద్యులపై చర్యలు
కురుపాం/జియ్యమ్మవలస రూరల్: గ్రామీణ వైద్యులు విచ్చలవిడిగా యాంటీబయాటిక్ మందులు ఇస్తూ రోగుల అనారోగ్యానికి కారణమవుతున్నారని.. అర్హత లేని ఆర్‌ఎంపీలపై చర్యలు తప్పవని జిల్లా ఔషధ నియంత్రణ అధికారి ఆషా షేక్ అన్నారు. కురుపాం మండల కేంద్రంలోని నీలకంఠేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్‌లకు ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మందుల షాపుల్లో పెద్ద మొత్తంలో యాంటీబయాటిక్స్, యాంటీ మలేరియా, స్టెరాయిడ్స్‌ను నిల్వ ఉంచరాదన్నారు. అంతేకాకుండా రికార్డులను సక్రమంగా నిర్వహిస్తూ, తనిఖీ సమయంలో అధికారులకు చూపించాలని సూచించారు. పేషెంట్లను వీలైనంతవరకు ప్రభుత్వ ఆస్పత్రులకు పంపించాలన్నారు. గ్రామాల్లోని ఆర్‌ఎంపీ, పీఎంపీలకు ఎట్టి పరిస్థితుల్లోను మందులు సరఫరా చేయొద్దని ఆదేశించారు. ప్రభుత్వ నిషేధిత మందులను పేషెంట్లకు డాక్టర్ చీటీ లేకుండా విక్రయిస్తే షాపుల లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. మెడికల్ షాపు యజమానులు తప్పనిసరిగా బిల్లు పుస్తకాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో మందుల షాపుల యజమానులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా ఔషధ నియంత్రణ అధికారి ఆపా షేక్