
వెండి మంటపం వద్ద స్వామి కల్యాణ మహోత్సవం జరిపిస్తున్న అర్చకులు
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని సీతారామస్వామి దేవస్థానంలో నిత్య పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు ఆదివారం అత్యంత వైభవంగా జరిపించారు. వేకువజామున స్వామికి ప్రాతః కాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత యాగశాలలో సుందరకాండ హోమం, ఆదిత్య హృదయం, సుదర్శన అష్టకం, సుదర్శన హవనం, తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం స్వామి వెండి మంటపం వద్ద సీతారామస్వామిని నూతన పట్టు వస్త్రాలతో సుందరంగా అలంకరించి నిత్య కల్యాణ మహోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. కార్తీకమాసం ఆదివారం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు కుటుంబసమేతంగా అధిక సంఖ్యలో రామతీర్థం విచ్చేసి స్వామిని దర్శించుకున్నారు. పలువురు సందర్శకులు బోడికొండ పైకి వెళ్లి సందడి చేశారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, నరసింహాచార్యులు పాల్గొన్నారు.