
ఈ ఏడాది జనవరిలో కొత్త పింఛన్లు తీసుకుని ఆనందం వ్యక్తం చేస్తున్న పింఛన్‌దారులు (ఫైల్)
నాడు: అన్ని అర్హతలూ ఉన్నా పింఛన్ మంజూరుచేయాలంటే ముందు ఆ నియోజకవర్గ రాజకీయ నాయకులను ప్రసన్నం చేసుకోవాలి. జన్మభూమి కమిటీ సభ్యుల కాళ్ల చుట్టూ తిరగాలి. ఎంతోకొంత ముట్టజెప్పాలి. అప్పటికి కూడా ఎప్పుడు మంజూరవుతుందో తెలియదు. పింఛన్ మంజూరైతే ఆ డబ్బుల కోసం పంచాయతీ కార్యాలయాల వద్ద పనులు మానుకుని రోజుల తరబడి పడిగాపులు కాయాలి. ఎంతోకొంత ముట్టజెబితే తప్ప చేతికి పింఛన్ అందని పరిస్థితి.
నేడు: పింఛన్ పొందేందుకు అర్హులై ఉంటే చాలు. వలంటీరు మీ ఇంటికి వస్తారు. పింఛన్ దరఖాస్తును పూరించి, మీతో సంతకం చేయించి సచివాలయంలో అందజేస్తారు. ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వకుండా.. ఎలాంటి వ్యయప్రయాసలు లేకుండా.. ఎవరి చుట్టూ తిరగకుండా.. దరఖాస్తు చేసిన రోజులు, నెలల వ్యవధిలో పింఛన్ అర్హత పత్రం మీ ఇంటికే చేరుతుంది. అక్కడి నుంచి ప్రతినెలా ఒకటో తేదీన మీ ఇంటివద్దకు వచ్చి వలంటీరు పింఛన్ డబ్బులు అందజేస్తారు. ఇదీ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లుగా సాగుతున్న
సంక్షేమ పాలన.
వీరఘట్టం: రాష్ట్ర ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి అవ్వాతాతలకు పింఛన్ కష్టాలు గట్టెక్కాయి. ఎటువంటి సిఫార్సులు లేకుండా.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్ ఇచ్చే సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. అర్హతే కొలమానంగా ప్రతీ ఆరునెలలకోసారి పింఛన్లు మంజూరు చేస్తున్నారు. ఇందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా 15 మండలాల నుంచి పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులను అధికారుల బృందం పరిశీలిస్తోంది. అర్హులను గుర్తిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 15,015 మంది కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోగా వీటిలో 14,895 మందిని ఇప్పటికే అర్హులుగా గుర్తించారు. నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. కొద్దిరోజుల్లో వీరందరికీ కొత్త పింఛన్లు మంజూరవుతాయని అధికారులు చెబుతున్నారు.
ఇచ్చిన మాట ప్రకారం..
అవ్వాతాతలకు ప్రస్తుతం ఇస్తున్న వైఎస్సార్ పింఛన్ కానుకను దశల వారీగా పెంచుకుంటూ రూ.3 వేలు చేస్తానంటూ 2019 సార్వత్రిక ఎన్నికల ముందు వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆ మేరకు రూ.2 వేలు ఉన్న పింఛన్‌ను ఏటా రూ.250 చొప్పున పెంచుతూ ప్రస్తుతం రూ.2,750కు చేర్చారు. దివ్యాంగులకు రూ.3 వేలు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.10 వేలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి రూ.5 వేలు పింఛన్ ఇస్తూ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు.
మన్యం జిల్లాలో..
పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ ఏడాది జనవరిలో 6,573 మందికి కొత్తగా పింఛన్ మంజూరు చేయడంతో ప్రసుత్తం వివిధ కేటగిరిల్లోని మొత్తం పింఛన్‌దారులు 1,38,885 మంది ఉన్నారు. ప్రస్తుతం వీరందరికీ ప్రతినెలా రూ.38,11,82,500లను ప్రభుత్వం అందిస్తోంది. తాజాగా కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 14,895 మందిని అర్హులుగా అధికారులు గుర్తించారు.అంటే వీరికి అదనంగా మరో రూ.4.09 కోట్లను కేటాయించనుంది. వచ్చే నెలలో కొత్త పింఛన్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
పింఛన్ దరఖాస్తులు
పరిశీలిస్తున్నాం
వైఎస్సార్ పింఛన్ కానుక కోసం జిల్లా వ్యాప్తంగా 15,015 దరఖాస్తులు రాగా వీటిలో 14,895 దరఖాస్తులు పరిశీలించి అర్హులుగా గుర్తించాం. మిగిలిన 120 మంది అందుబాటులో లేకపోవడంతో పరిశీలించలేదు. ఈ నివేదికను ప్రభుత్వానికి పంపిస్తాం. ఇంకా పింఛన్‌దారులు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లాలో ప్రతినెలా రూ.38.11 కోట్లను పింఛన్‌దారులకు అందజేస్తున్నాం.
– పి.కిరణ్‌కుమార్,
డీఆర్‌డీఏ పీడీ పార్వతీపురం మన్యం జిల్లా
జిల్లాలో కొనసాగుతున్న పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ఇప్పటివరకు గుర్తించిన కొత్త పింఛన్ లబ్ధిదారులు 14,895 మంది
తుది జాబితాను సిద్ధం చేస్తున్న యంత్రాంగం
ప్రస్తుతం ఇస్తున్న పింఛన్లు: 1,38,885
వీరికి ప్రతినెలా అందజేస్తున్న పింఛన్ మొత్తం: రూ.38.11 కోట్లు
అదనంగా చెల్లించాల్సిన మొత్తం: రూ.4.09 కోట్లు

