దమనకాండ | - | Sakshi
Sakshi News home page

దమనకాండ

Oct 24 2026 5:41 AM | Updated on Oct 24 2026 5:41 AM

దమనకాండ పల్నాడు జిల్లాలో అధికార మదంతో రెచ్చిపోయిన పచ్చ గూండాలు కాసు కాలు కదపనీయని పోలీసులు నరసరావుపేటలో గోపిరెడ్డి నిరాహారదీక్ష నిర్బంధంలోనే మాజీ ఎమ్మెల్యే నంబూరు సత్తెనపల్లిలో డాక్టర్‌ గజ్జల నిరసన

వినుకొండలో బొల్లా హౌస్‌ అరెస్టు

వైఎస్సార్‌సీపీ పేరుతో టీడీపీ నేతల నామినేషన్లు

మాచర్లలో మూడు రోజులుగా పీఆర్కే నిర్బంధం

టీడీపీ మూకల
పల్నాడు జిల్లాలో అధికార మదంతో రెచ్చిపోయిన పచ్చ గూండాలు

● అధికార పార్టీ చెప్పుచేతల్లో పనిచేసిన

పోలీసులు, అధికార యంత్రాంగం

● నామినేషన్‌ కేంద్రాల్లో కర్రలు, రాడ్లతో

టీడీపీ గూండాలు తిరుగుతున్నా

పట్టించుకోని వైనం

● సత్తెనపల్లి మినహా ఎక్కడా

నామినేషన్లు వేయనీయకుండా

అడ్డగింత

● మాచర్లలో ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్‌,

టీవీ రిపోర్టర్లపై దాడి చేసి సెల్‌ఫోన్లు

లాక్కుని దౌర్జన్యం

● మహిళలతోనూ అమానుషంగా

ప్రవర్తించిన టీడీపీ గూండాలు

● వస్త్రాలు లాగేసి, జాకెట్లు చించి

నామినేషన్‌ పత్రాలు లాక్కెళ్లిన

పచ్చ మూకలు

● మాజీ మంత్రి విడదల రజినిపై

మహిళా ఎస్‌ఐ దురుసు ప్రవర్తన

● వైఎస్సార్‌ సీపీ తరఫున 150 ఎంపీటీసీ

స్థానాలకు టీడీపీ నేతల నామినేషన్లు

● కోర్టులు, ఎస్‌ఈసీకి నామినేషన్లు

వేయించామని చూపేందుకు కుట్ర

● పల్నాడు జిల్లాలో దారుణాలపై

ఛీత్కరించుకుంటున్న ప్రజలు

దాచేపల్లిలో టీడీపీ నేతల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న సైదారెడ్డి

సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పల్నాడు జిల్లాలో అధికార పార్టీ నేతలు, పోలీసులు వ్యవహరించిన తీరు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. ఎన్నికల్లో ఓటమి భయంతో మహిళలపై అసభ్యంగా ప్రవర్తించడం, దుస్తులు లాగడం, జాకెట్లు చించడం వంటి అమానుష ఘటనలకు పాల్పడి, వారి వద్ద నుంచి నామినేషన్‌ పత్రాలను లాక్కుని చించివేసిన ఘటనలు జిల్లాలో అనేకం ఉన్నాయి. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా జిల్లా కలెక్టర్‌, ఎస్పీ నుంచి కింది స్థాయి అధికారుల వరకు డ్రామాలాడారే తప్ప ప్రజాస్వామ్యాన్ని కాపాడలేకపోవడం దారుణమైన విషయం. చివరకు టీడీపీ నేతల దాష్టీకాలు, పోలీసుల దుశ్చర్యలను ఫొటోలు తీస్తున్నారనే కారణంతో ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్‌, టీవీ రిపోర్టర్లపై దాడులకు సైతం తెగబడ్డారు. సెల్‌ఫోన్లు లాక్కుని, పోలీసుల ఎదుటే వారిపై దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించిన పరిస్థితి.

గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డిని మూడు రోజులుగా హౌస్‌ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గురజాల నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఒక్క ఎంపీటీసీ స్థానానికి కూడా వైఎస్సార్‌ సీపీ నేతలను నామినేషన్లు వేయకుండా టీడీపీ గూండాలు, పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. దాచేపల్లిలో నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన వైఎస్సార్‌ సీపీ ఎంపీపీ అభ్యర్థి జక్కా సంధ్యను అడ్డుకోవడంతోపాటు ఆమె భర్త అశోక్‌ను సెల్‌ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా గుంటూరువైపు వెళుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను తీవ్రంగా కొట్టినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

● దాచేపల్లి వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో ఉన్న కేశానుపల్లి ఎంపీటీసీ అభ్యర్థి తోట కృష్ణను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ముత్యాలంపాడు ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు వచ్చిన ప్రభావతి, చితిమిరెడ్డి రమణ అనే మహిళా అభ్యర్థులపై టీడీపీ గూండాలు దాడి చేసి నామినేషన్‌ పత్రాలను చించివేశారు. వారిని ప్రతిపాదించేందుకు వచ్చిన సైదారెడ్డి, మేడా తిరుపతిరెడ్డిలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నరసరావుపేట, రొంపిచర్ల మండలాల వైఎస్సార్‌ సీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసి స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం నుంచి నిరాహార దీక్షకు దిగారు. బుధవారం రొంపిచర్లలో ధర్నా చేస్తున్న డాక్టర్‌ గోపిరెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన ఎస్పీ... తాము భద్రత కల్పించి నామినేషన్లు వేయిస్తామని హామీ ఇచ్చి మాట తప్పడంతో ఆయన ఈ దీక్షకు దిగారు. ఇద్దరు జెడ్పీటీసీలు, 45 మంది ఎంపీటీసీలతో నామినేషన్లు వేయిస్తామని చెప్పి, రెండు రోజులుగా డ్రామాలాడటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు సాయంత్రం 4 గంటలకు ఓ డీఎస్పీ వచ్చి నామినేషన్‌ కేంద్రాలకు పోలీసు భద్రతతో తీసుకెళతామని చెప్పారు. దూరం నుంచి రాళ్లు పడితే తాము ఏమీ చేయలేమంటూ పరోక్షంగా బెదిరింపులకు దిగడం గమనార్హం.

● ఎంపీడీవో కార్యాలయంలో కర్రలు, రాళ్లతో టీడీపీ గూండాలు హల్‌చల్‌ చేస్తున్నా, చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా టీడీపీ గూండాలు మోహరించి ఉన్నా పోలీసులు పట్టించుకోలేదు. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించారు. మాచర్ల జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ వేయడానికి నరసరావుపేట వచ్చిన దొడ్డ చిన్నపేతురాజు యాదవ్‌పై టీడీపీ గూండాలు దాడి చేసి కిడ్నాప్‌ చేసేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకుని ఆయన్ను వెనక్కి పంపించిన పరిస్థితి.

పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావును మూడు రోజులుగా హౌస్‌ అరెస్టు చేసిన పోలీసులు, పెదకూరపాడు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఎక్కడా నామినేషన్లు వేయకుండా టీడీపీ గూండాలు, పోలీసులు అడ్డుకున్నారు. పెదకూరపాడు–3 ఎంపీటీసీ అభ్యర్థి నల్లపాటి మహాలక్ష్మి తనకు పోలీసు భద్రతతో నామినేషన్‌ వేసే అవకాశం కల్పించాలని కోరుతూ హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ వేయగా, కోర్టు అనుమతించింది. అయితే, తమకు ఆదేశాలు సాయంత్రం 4.40 గంటలకు అందాయని, అక్కడికి తీసుకెళ్లేలోపు సమయం అయిపోయిందంటూ పోలీసులు చేతులెత్తేశారు.

● నాగిరెడ్డిపాలెంలో జనసేన ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ వేయడానికి వచ్చిన పగడాల శ్రీనివాస్‌ను అడ్డుకుని, నామినేషన్‌ పత్రాలను చించివేసిన టీడీపీ గూండాలు... ఆయనతో పాటు వచ్చిన వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. టీడీపీ గూండాలను పోలీసులు అడ్డుకోకుండా, జనసేన నేతలపై లాఠీచార్జి చేసి తరిమికొట్టడం గమనార్హం.

● పెదకూరపాడు బస్టాండ్‌లో ప్రయాణికుల మాదిరిగా కూర్చున్న వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థుల సమాచారం అందుకున్న ఎస్‌ఐ సంధ్యారాణి అక్కడికి చేరుకుని, ప్రయాణికులతో పాటు అభ్యర్థుల బ్యాగులను తనిఖీ చేశారు. దీన్ని బట్టి టీడీపీ గూండాలకు పోలీసు అధికారులు తొత్తులుగా ఎలా పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండలంలో నామినేషన్లు వేయనీయకుండా ఎస్‌ఐ మణికృష్ణ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అడ్డుకోవడంతో ఆగ్రహించిన నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ గజ్జల సుధీర్‌ భార్గవరెడ్డి, అభ్యర్థులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తమ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటున్నారంటూ ఎస్పీకి ఫోన్‌ చేసి మాట్లాడినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ సందర్భంగా రఫీ అనే కార్యకర్తపై టీడీపీ గూండాలు రాళ్లతో దాడి చేయడంతో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి.

● నకరికల్లులో ముగ్గురు ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్లు వేసి, అధికారుల నుంచి రశీదులు కూడా తీసుకుని బయటకు వచ్చారు. టీడీపీ నేత బాజీ చౌదరి ఆధ్వర్యంలో టీడీపీ గూండాలు అధికారుల వద్ద నామినేషన్‌ పత్రాలను చించివేయడంతో ఉన్నతాధికారులు అక్కడికి వచ్చి, ముగ్గురు అభ్యర్థులను ఫోన్‌ చేసి పిలిపించి మళ్లీ నామినేషన్లు వేయించారు. బాజీ చౌదరి, ఆయన అనుచరులు ఈ దుశ్చర్యలకు పాల్పడినా వారిపై కనీసం కేసు నమోదు చేయలేదు.

వినుకొండలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని నరసరావుపేటలోని తన నివాసంలో మూడు రోజులుగా హౌస్‌ అరెస్టులో ఉంచిన విషయం తెలిసిందే. ఆయన శుక్రవారం వినుకొండ వెళ్లేందుకు ప్రయత్నించగా, అక్కడికి వచ్చిన డీఎస్పీ హనుమంతరావు తాము నామినేషన్లు వేయిస్తామంటూ అక్కడి సీఐలతో ఫోన్‌లో మాట్లాడి కొంతసేపు డ్రామాలాడారు.

శావల్యాపురం మండలం పొట్లూరు గ్రామానికి చెందిన ఐదుగురు వైఎస్సార్‌ సీపీ నేతలు కలెక్టర్‌ అనుమతితో, పోలీసుల భద్రత నడుమ నామినేషన్‌ వేసేందుకు వెళ్లారు. టీడీపీ మూకలు రాళ్లతో దాడి చేశాయి. కారును ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాయి. ప్రాణభయంతో కారును వేగంగా ముందుకు పోనివ్వడంతో కొంతమందికి గాయాలైనట్లు సమాచారం.

వినుకొండ మండలం నాగులవరం వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు వెళుతున్న భవనాసి మరియమ్మ, మండల మహిళా విభాగం అధ్యక్షురాలు గోదాల చిన్నమ్మలపై టీడీపీ గూండాలు దాడి చేశారు. నామినేషన్‌ పత్రాలను చించివేశారు.

నూజెండ్ల మండలం పమిడిపాడు వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు వెళుతున్న మేకల విజయపై టీడీపీ నేతలు రాళ్లు రువ్వుతూ దాడి చేశారు. ఆమె నుంచి నామినేషన్‌ పత్రాలను లాక్కుని చించివేశారు. ఆగ్రహించిన విజయ టీడీపీ గూండాలకు చెప్పు చూపించి బుద్ధి చెప్పారు.

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నరసరావుపేట రోడ్డు మీదుగా నామినేషన్‌ వేసేందుకు కలిసి వెళుతుండగా, శివయ్య స్తూపం వద్ద కాపు కాసిన టీడీపీ గూండాలు... కర్రలు, రాళ్లతో దాడి చేస్తూ అడ్డుకున్నారు. వారికి పోలీసులు కూడా వత్తాసు పలికారు. గురువారం రాత్రి నుంచే నియోజకవర్గంలోని ఐదు మండలాల కన్వీనర్లను, న్యాయవాది ఎం.ఎన్‌. ప్రసాద్‌, అమ్మిరెడ్డి అంజిరెడ్డి వంటి ముఖ్య నేతలతోపాటు 30 మందికి పైగా నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్‌లో కూర్చోబెట్టారు.

పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి నియోజకవర్గం మినహా ఏ నియోజకవర్గంలోనూ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న పోలీసులు, టీడీపీ గూండాలు.. కొత్త కుట్రకు తెరతీశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా అడ్డుపడటంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో అధికార పార్టీ నేతలు వైఎస్సార్‌సీపీ పేరుతో నామినేషన్లు వేయించారు. కోర్టులు, ఎస్‌ఈసీని తప్పుదోవ పట్టించే కుట్రకు తెరతీశారు. ఇందులో భాగంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా సుమారు 150కు పైగా నామినేషన్లను ఇలా వేయించడం గమనార్హం. ఇంత దిగజారి ఎన్నికల్లో గెలిచినట్లు చూపించుకోవాలా అంటూ జిల్లా ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు.

మాచర్లలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మూడు రోజులుగా పోలీసులు హౌస్‌ అరెస్టు చేసి నిర్బంధించిన విషయం తెలిసిందే. మాచర్ల ఎంపీడీవో కార్యాలయం వద్ద టీడీపీ గూండాలు కర్రలు, రాడ్లతో హల్‌చల్‌ చేస్తున్న వైనాన్ని ఫొటోలు తీసేందుకు ప్రయత్నించిన ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్‌ భజరంగ్‌, టీవీ రిపోర్టర్లు బాలాజీ, వంశీలపై టీడీపీ గూండాలు దాడి చేసి, వారిని గాయపరిచారు. వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లను కూడా లాక్కుని ఫొటోలను డిలీట్‌ చేశారు. సెల్‌ఫోన్లు వెనక్కి ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నా, ఎదురుగా ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు.

రాయవరం ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు వచ్చిన గోగినేని లక్ష్మారెడ్డిపై టీడీపీ మూకలు దాడి చేసి, ఆయన వద్ద ఉన్న నామినేషన్‌ పత్రాలను చించివేశాయి. కంభంపాడుకు చెందిన వైఎస్సార్‌ సీపీ నేత జువ్వాజి సాంబిరెడ్డి మాచర్ల నుంచి వెళుతుండగా, రాయవరం జంక్షన్‌ వద్ద టీడీపీ గూండాలు దాడి చేసి కారు అద్దాలను ధ్వంసం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement