● గురజాలలో తమ్ముళ్ల వేరు కుంపట్లు
● వేర్వేరు అభ్యర్థులకు
ఎమ్మెల్యే, ఎంపీలు మద్దతు
● స్థానిక ఎన్నికల వేళ శ్రేణుల్లో
అయోయమం
పిడుగురాళ్ల రూరల్: ‘మేమంతా ఒక్కటే... కూటమిగా కలిసే నడుస్తాం‘ అని వేదికలపై ప్రకటనలు గుప్పించే నాయకులు.. తెరవెనుక మాత్రం అసలు సిసలైన రాజకీయ క్రీడకు తెరలేపుతున్నారా? మాటల్లో మైత్రిని నటిస్తూనే... చేతల్లో సొంత పార్టీ నేతలకే ఎసరు పెడుతున్నారా? పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో చోటుచేసుకున్న తాజా పరిణామాలు ఇప్పుడు స్థానిక రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ఒకే గ్రామం... ఒకే కూటమి... కానీ ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించేందుకు వేసిన వ్యూహాలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
భగ్గుమన్న విభేదాలు
నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు గురజాల స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతో పొసగడం లేదనే వార్తలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. తాజాగా జెడ్పీటీసీ నామినేషన్ల ఘట్టం దానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది. పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామానికి చెందిన ప్రముఖ వైద్యుడు ఉన్నం నాగమల్లికార్జునరావు సతీమణి దీపికకు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మద్దతుతో జెడ్పీటీసీ అభ్యర్థిగా, ఆపై జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా రేసులో నిలిచే అవకాశం లభించింది. అయితే, ఈ అభ్యర్థిత్వానికి పైకి మద్దతు తెలుపుతున్నట్లే నటిస్తున్న ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు... లోలోపల మాత్రం సొంత వర్గంతో చెక్ పెట్టే వ్యూహానికి తెరలేపారని ఆరోపణలు వస్తున్నాయి.
ఒకే పార్టీ నుంచి రెండు నామినేషన్లు...
పిడుగురాళ్లలో హాస్పిటల్ నడుపుతూ ఆర్థికంగా, రాజకీయంగానూ బలంగా ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ ఉన్నం నాగమల్లికార్జునరావు దంపతులు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. వీరు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుకు మొదటి నుంచీ అత్యంత సన్నిహితులుగా వ్యవహరిస్తున్నారు. డాక్టర్ దంపతులు నామినేషన్ వేస్తున్న సమయంలోనే వారికి స్థానిక ఎమ్మెల్యే నుంచి అనూహ్యమైన షాక్ తగిలింది. అదే గ్రామానికి, అదే పార్టీకి చెందిన మరో ముఖ్య నాయకుడు పోటీగా నామినేషన్ దాఖలు చేయడం కలకలం రేపింది. దీని వెనుక ఎమ్మెల్యే యరపతినేని ప్రోద్బలం ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
భవిష్యత్తు వారసత్వ పోరుపై ఆందోళన?
గతంలో వైఎస్సార్ సీపీలో ఉన్న డాక్టర్ ఉన్నం నాగమల్లికార్జునరావును 2024 ఎన్నికల సమయంలో అధిష్ఠానం సూచనల మేరకు యరపతినేని స్వయంగా ఒప్పించి టీడీపీలోకి తీసుకువచ్చారు. ఆ సమయంలో చంద్రబాబు సమక్షంలో కండువా కప్పుకోగా, భవిష్యత్తులో గురజాల నియోజకవర్గ పునర్విభజన జరిగితే డాక్టర్ మల్లికార్జునరావుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇస్తామని అధిష్ఠానం మాట ఇచ్చింది. ఇప్పుడు డాక్టర్ దంపతులు రాజకీయంగా మరింత బలపడితే, భవిష్యత్తులో తన కుమారుడి రాజకీయ అరంగేట్రానికి గండి పడుతుందనే ఆందోళనతోనే యరపతినేని ఇలా చేస్తున్నారని కూటమి వర్గాల్లో అంతర్గత చర్చ నడుస్తోంది. ఒకే కూటమిలో ఉంటూ, ఒకే వేదిక పంచుకుంటూ కూడా స్థానిక నేతలు సాగిస్తున్న ఈ ‘పరోక్ష సమరం’ గురజాల నియోజకవర్గంలో కూటమి శ్రేణులను తీవ్ర అయోమయానికి గురిచేస్తోంది. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో, పార్టీ అధిష్ఠానం దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


