రెడ్‌బుక్‌ ఎన్నికలపై ఎస్‌ఈసీకు ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

రెడ్‌బుక్‌ ఎన్నికలపై ఎస్‌ఈసీకు ఫిర్యాదు

Oct 24 2026 5:41 AM | Updated on Oct 24 2026 5:41 AM

మాజీ మంత్రి విడదల రజిని అర్ధరాత్రి వరకు కొనసాగిన నామినేషన్ల ఉపసంహరణ ఎస్‌ఈసీకి ఆధారాలు అందజేత ఎంపీటీసీ నామినేషన్లు వేయకుండా టీడీపీ గూండాలు అడ్డుకోవడంపై ఆగ్రహం

చిలకలూరిపేట: రెడ్‌బుక్‌ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి విడదల రజిని చెప్పారు. పట్టణంలోని ఎన్‌ఆర్‌టీ రోడ్డులో ఉన్న ఆమె నివాసంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ చిలకలూరిపేట మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ మెప్పు కోసం అధికారులు ఎన్నికల నిబంధనలను, ప్రజాస్వామ్యాన్ని మంటగలిపారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు మధ్యాహ్నం మూడు గంటలు కాగా అర్ధరాత్రి 12 గంటల వరకు బలవంతంగా వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థులను ఎత్తుకెళ్లి నామినేషన్లు ఉపసంహరింపచేశారని విమర్శించారు. దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, ఈ ఆధారాలతో ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. బుధవారం జరిగిన సంఘటనలకు సంబంధించి పురపాలక సంఘం కార్యాలయంలో ఉన్న సీసీ పుటేజీలను ఫ్రీజ్‌ చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరామన్నారు. నామినేషన్ల ఉపసంహరణలు, ఇతర వివరాలను అడిగితే మున్సిపల్‌ కార్యాలయంలో ఎలాంటి సమాధానం లభించటంలేదని పేర్కొన్నారు. మూడు గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిశాక అర్ధరాత్రి దాక కార్యాలయంలో చేసిన ఘన కార్యాలేమిటో బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో మున్సిపల్‌ ఎన్నికలను తాత్కాలికంగా ఆపుతున్నట్లు ఎస్‌ఈసీ ప్రకటించాక కూడా మున్సిపల్‌ కార్యాలయంలో నామినేషన్ల ఉపసంహరణ కొనసాగించారని తెలిపారు. ఈ విషయమై ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేశామని, ఎస్‌ఈసీ తగు చర్యలు తీసుకోకపోతే హైకోర్టును, అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని రజిని చెప్పారు.

వేడుకు చూస్తున్న పోలీసులు

జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు నామినేషన్‌ వేయకుండా టీడీపీ గూండాలు అడ్డుకుంటున్నా పోలీసులు వేడుక చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీవో కార్యాలయాల చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి పహారా ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. బారికేడ్ల వద్ద టీడీపీ రౌడీ మూకలు మోహరించి, వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి వస్తే దారుణంగా దాడులకు పాల్పడి నామినేషన్‌ పత్రాలను చించి వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది పోలీసుల కళ్లముందే జరుగుతున్నా నివారించకుండా వేడుక చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించేందుకు వెళ్లకుండా తనను రెండు రోజులుగా గృహ నిర్బంధంలో ఉంచి పార్టీ కార్యకర్తలు, నాయకులను సైతం కలవకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యడ్లపాడు మండలంలో నామినేషన్లు వేయనీయకపోవడంతో మహిళలు సైతం రోడ్డెక్కి ఆందోళనకు దిగిన సంఘటన కూటమి ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న ఆగ్రహానికి అద్దం పట్టిందన్నారు. ఇప్పటి వరకు చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడు మండలాలకు సంబంధించి ఏ ఒక్కరిని ఎంపీటీసీ నామినేషన్‌ వేయకుండా టీడీపీ గుండాలు అడ్డుకున్నారని, ఇదంతా ప్రజలు చూస్తున్నారని సమయం వచ్చినప్పుడు తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఎన్ని అవంతరాలు సృష్టిస్తున్నా, దాడులకు పాల్పడుతున్నా మొక్కవోని ధైర్యంతో ముందుకు వస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు చిట్టా విజయభాస్కరరెడ్డి తదితరు లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement