6వ బెటాలియన్ కమాండెంట్ మురళి
మంగళగిరి టౌన్: విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ కమాండెంట్ మురళి పేర్కొన్నారు. మంగళగిరి పట్టణంలోని 6వ బెటాలియన్‌లో పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వారోత్సవాలు నిర్వహించారు. శుక్రవారం నిర్వహించిన సెమినార్‌లో మురళి మాట్లాడుతూ ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు అందిస్తున్న సేవలను, విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న సవాళ్లను కొనియాడారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడంలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే పోలీసుల సేవలు అధినందనీయమన్నారు. అనంతరం అమరుడైన 6వ బెటాలియన్ కానిస్టేబుల్ నరసయ్య నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో బెటాలియన్ అదనపు కమాండెంట్ ఆశీర్వాదం, అసిస్టెంట్ కమాండెంట్ రవి, విట్ కళాశాల ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చీరాల టౌన్: రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ జి.జయలక్ష్మి శుక్రవారం చీరాల వచ్చారు. జిల్లాలో జరుగుతున్న భూముల రీసర్వే పరిశీలనకు వచ్చిన ఆమెకు.. చీరాల ఆర్డీవో ఎస్.నరసింహారావు, తహసీల్దార్ కె.గోపీకృష్ణలు పుష్పగుచ్ఛాలు అందించారు. చీరాల మండలంలోని వాడరేవులోని ఐఎల్‌టీడీ అతిథి గృహంలో జయలక్ష్మికి విడిది ఏర్పాటు చేశారు. పలువురు రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిశారు.
నగరంపాలెం: స్థానిక బృందావన్‌గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై రెండు రోజుల పాటు జరగనున్న అమరావతి నృత్యోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కేఆర్‌కేఎం మెమోరియల్ అకాడమీ, క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ (ఏపీ ప్రభుత్వం) సంయుక్తంగా చేపట్టగా, అతిథులు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. సభాధ్యక్షురాలుగా కోకా విజయలక్ష్మి వ్యవహారించారు. తొలుత కేఆర్‌కేఎం శిష్య బృందం స్వాగత నృత్యం చేశారు. అనంతరం ప్రీతి మొహాపాత్ర (హైదరాబాద్) ఒడిస్సి నృత్యాన్ని, చల్లా వేదవల్లి(హైదరాబాద్) కూచిపూడి నృత్యాన్ని, చెరుకు అనుష్క (హైదరాబాద్) భరత నాట్యాన్ని ప్రదర్శించారు. తమ బాణీలతో చక్కటి హావభావాలు పలకించారు. నృత్యభంగిమలతో నృత్య ప్రదర్శన చేయగా అలరించాయి. కార్యక్రమంలో ఏపీ టాక్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రామరాజు శ్రీనివాస్, కళారత్న అవార్డు గ్రహీత రాయన గిరిధర్‌గౌడ్, ప్రముఖ కవి భూసురపల్లి వెంకటేశ్వర్లు, ఆలయ పాలక మండలి అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య ప్రసంగించారు. అతిథులు, కళాకారులను సంస్థ అధ్యక్షుడు, నాట్యాచార్య కాజ వేంకటసుబ్రహ్మణ్యం సత్కరించారు.
తాడికొండ: తుళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ రూ.25 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు శుక్రవారం పట్టుబడ్డాడు. అదే అసుపత్రిలో ఆఫీస్ సబార్డినేట్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరావు నుంచి లంచం డిమాండ్ చేయడంతో ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శ్రీనివాసరావు నెల రోజులపాటు విధులకు సెలవు పెట్టిన నేపథ్యంలో డాక్టర్ శ్రీనివాస్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. క్లియర్ చేసేందుకు నెల జీతం ఇవ్వాలని డిమాండ్ చేయగా చివరకు రూ.25 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దాడిలో ఏసీబీ డీఎస్పీ టీవీవీ ప్రతాప్ కుమార్, సీఐలు సురేష్, నాగరాజు, కుమ్మరి శ్రీనివాసరావు, జీఎల్ శ్రీనివాసరావులు పాల్గొన్నారు.


