నీరు లేక బీడు పెట్టిన భూమి వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడనే దారుణం
రాజకీయ కక్షతోనే తొలగించారు..
నూజెండ్ల: మండలంలో టీడీపీ నేతలు రాజకీయ కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారు. వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడనే నెపంతో ఓ రైతుకు చెందిన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ను తొలగించారు. దీంతో తన పొలాన్ని బీడు పెట్టాడు. మండల పరిధిలోని రవ్వవరం గ్రామానికి చెందిన రైతు గొంగటి బ్రహ్మారెడ్డికి రెండెకరాల భూమి ఉంది. రెండేళ్ల కిందట విద్యుత్ కనెక్షన్ కోసం రెవెన్యూ అధికారుల వద్ద నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకుని విద్యుత్ శాఖాధికారులకు దరఖాస్తు పెట్టుకున్నాడు. పొలాన్ని పరిశీలించి సంబంధిత అధికారులు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి బోరు ద్వారా పొలాన్ని సాగు చేసుకుంటున్నాడు. ఇటీవల కొందరు రాజకీయ కక్షలతో రెవెన్యూ, విద్యుత్ అధికారుల మీద ఒత్తిడి తెచ్చి విద్యుత్ కనెక్షన్ తొలిగింప చేయించారు. అదేమని అడిగితే మీ పొలం ప్రభుత్వం భూమిలో ఉందంటూ సమాధానమిచ్చారు. రెవెన్యూ అధికారులు చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది. కనెక్షన్ తొలగించి రెండు నెలలు అవుతుండడంతో నీరు లేక పంట సాగు చేయకుండా బీడు పెట్టారు. దయచేసి అధికారులు తనకు విద్యుత్ సౌకర్యం పునరుద్ధరించాలని కోరుతున్నాడు. వినుకొండ ఏడీఏ శ్రీనివాసులును వివరణ కోరగా రెవెన్యూ అధికారుల సూచనలతోనే విద్యుత్ కనెక్షన్ తొలగించామని తెలిపారు. బోరు బావిని ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేయటం వలన సమస్య తలెత్తిందని అన్నారు. తహసీల్దార్ రమేష్కుమార్ మాట్లాడుతూ సొంత భూమి నెంబర్తో దరఖాస్తు చేసుకున్నప్పటికీ బోరును మాత్రం ప్రభుత్వ భూమి (సర్వే నెంబర్ 324–9) లో రైతు బ్రహ్మారెడ్డి ఏర్పాటు చేయించాడు. ఇదే విషయంపై ఫిర్యాదు రావటంతో సర్వే చేయించి ప్రభుత్వ భూమిని విడగొట్టామని తెలిపారు.
రైతులందరూ ఇదే ప్రాంతంలో బోరులు ఏర్పాటు చేసుకున్నారు. రాజకీయ కక్షలతో నా ఒక్కడిపైనే వేధింపులకు పాల్పడుతున్నారు. అధికారులు నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి వత్తాసు పలుకుతున్నారు. విద్యుత్ కనెక్షన్ పునరుద్ధరించకపోతే నా కుటుంబ రోడ్డున పడుతుంది.
– గొంగటి బ్రహ్మరెడ్డి, రైతు


