మొదటిరోజు హింసాకాండను ఖండించిన డాక్టర్ గోపిరెడ్డి ప్రజలకు మేలు చేశామనుకుంటే నామినేషన్లను అడ్డుకోవద్దు
నరసరావుపేట: రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీ మద్దతుదార్లు మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు వేయనీయకుండా తెలుగుదేశం పార్టీ అరాచకం సృష్టించటం ఘోరమని మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా విమర్శించారు. నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో శుక్రవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. పల్నాడు జిల్లాలోని దాచేపల్లిలో నగరపంచాయతీకి చైర్మన్ అభ్యర్థిపైన అక్రమ కేసు నమోదుచేసి అరెస్టు చేయటం, నామినేషన్లు ఎవరూ వేయకుండా పిడుగురాళ్ల పురపాలకసంఘానికి తాళాలు వేయటం చూస్తుంటే ఎన్నికలు ఏవిధంగా జరగబోతున్నాయో తేటతెల్లమౌతుందన్నారు. పుంగనూరులో ఎంపీ మిధున్రెడ్డిపై దాడి, ధర్మవరంలో మున్సిపల్ నామినేషన్లు వేసేందుకు వచ్చిన వారిపై దాడులు టీడీపీ అరాచకత్వానికి పరాకాష్ట అన్నారు. సుమారు పదికార్లు, అక్కడ పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టారన్నారు. వీటిని పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మొదటిరోజే హింసతోనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందన్నారు. చంద్రబాబు చెప్పేవన్నీ నీతులేనని, తాను మాత్రం సిగ్గులేని పనులు చేస్తుంటాడన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్లకు ఎన్నికల ప్రక్రియ సాఫీగా జరిగితే ఓడిపోతామనే భయం పట్టుకుందన్నారు. నిజంగా వారి పాలనపైన, ప్రజలు తమనే గెలిపిస్తారనే వారికి నమ్మకం ఉంటే ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. దమ్మూ, ధైర్యం ఉంటే ఎన్నికల మానిఫెస్టోతో ఎన్నికలకు రావాలని సూచించారు. ఎన్ని దౌర్జన్యాలు చేసినా తమ పార్టీ వెనుకంజ వేయదని, పోటీకి తామంతా సిద్దంగా ఉన్నామన్నారు. వారికి తాము చేసిన వాగ్దానాలు అమలుచేశామని, మంచి చేశామని అనుకుంటే ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా నామినేషన్ వేసేందుకు ప్రజాస్వామ్యబద్దంగా సహకరించాలని సూచించారు. ఈవిధంగా జరిగి ప్రజల తీర్పును తాము అంగీకరిస్తామని పేర్కొన్నారు.


